ఏపీ అసెంబ్లీ పరిణామాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం అని చెప్పిన ఆయన.. ఆ విమర్శలు వ్యక్తిగతంగా కాకుండా, ప్రజాసమస్యలపై ఉంటే బాగుండేదని అన్నారు. ఆడపడుచులను గౌరవించడం మన సంప్రదాయమని, అలా కాకుండా మహిళలపై పరుష పదజాలం వాడితే అది అరాచక పాలనే అవుతుందని ఎన్టీఆర్ విమర్శించారు.
‘మాట.. మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. అవన్నీ ప్రజాసమస్యలపై జరగాలి కానీ వ్యక్తిగత దూషణలు , విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు’ అని ఎన్టీఆర్ చెప్పారు.
‘స్త్రీ జాతిని గౌరవించడమనేది, మన ఆడపడచులను గౌరవించడమనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, జవజీవాల్లో, రక్తంలో ఇమిడిపోయినటువంటి సంప్రదాయం. అలాంటి సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలి. అంతేకానీ దాన్ని కాల్చేసి రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు’ అన్నారు.
‘ఈ మాటలు వ్యక్తిగత దూషణలకు గురైన బాధిత కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశపౌరుడిగా, ఒక తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలా జాగ్రత్తపడండి. ఇదే నా విన్నపం. ఇది ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నాను‘ అంటూ ఎన్టీఆర్ వీడియో సందేశం ఇచ్చారు.
కాగా, అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాకౌట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాలకృష్ణ కూడా స్పందించారు. ఇకపై ఇలాంటివి రిపీట్ అయితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు
ఏపీ అసెంబ్లీ పరిణామాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ pic.twitter.com/COaRp1KDFs
— Karimnagar News (@karimnagarlocal) November 20, 2021