మాతా శిశువు ఆసుపత్రిలో బాలింత మృతి
కరీంనగర్ మాతా శిశువు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మమతకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ నిర్లక్ష్యానికి కారకులైన వైద్యురాలిపై చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మమతను కరీంనగర్ ప్రభుత్వ మాత శిశు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ నెల మమత 9న మధ్యాహ్నం ఒంటిగంటకు బాబుకు జన్మనిచ్చింది. అప్పటి నుండి వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందిందని ఆమె భర్త గర్శకుర్తికు చెందిన చిందం శ్రీకాంత్ తెలిపారు.
సమాచారం అందుకున్న డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ మాతాశిశు ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం వల్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించి రోగులను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.