అల్లు అర్జున్ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరో తెలుసా.? తమిళ మీడియా ఇంటర్వ్యూలో బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ విడుదల కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించడానికి సిద్ధమవుతోందీ చిత్రం. పుష్ప చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. ఇక బన్నీ ఇప్పటికే తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితమే అయినా తొలి పాన్ ఇండియా చిత్రం మాత్రం పుష్ప అనే చెప్పాలి. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా విడుదలకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను పెంచేసింది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అల్లు అర్జున్ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా బన్నీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తన చిత్రాలు డబ్ అయి యూట్యూబ్‌లో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, తనను ఇప్పటికే పరోక్షంగా బాలీవుడ్‌కి పరిచయం చేశాయని.. అయితే తనకు మాత్రం తమిళనాడలో గెలవాలనుందని మనసులో మాట బయటపెట్టారు బన్నీ. ఇక పుష్ప చిత్రం పాటలతో కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైందని తెలిపిన బన్నీ… ఇందుకు దేవిశ్రీ ప్రసాద్‌కి ధన్యవాదాలు తెలిపారు.
ఇక టాలీవుడ్లో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది అల్లు అర్జున్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీకి ఇంత ఫాలోయింగ్ ఉండడానికి ఆయన స్టెప్పులు కూడా కారణమని చెప్పవచ్చు. అయితే తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకునే బన్నీకి ఇష్టమైన డ్యాన్సర్స్ ఎవరని ప్రశ్నించగా.. ‘తమిళ చలన చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్, విజయ్, ధనుష్, శింబు, శివకార్తికేయన్ బాగా డ్యాన్స్ చేస్తారనేది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు.