రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు వద్దా.. ? : మంత్రి హరీశ్ రావు
రైతుల ఓట్లు కావాలి కానీ అదే రైతు పండించిన వడ్లను మాత్రం కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో 300 పడకల జిల్లా ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1969 నుంచి కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కొంటున్న దన్నారు. ఎప్పటిలాగానే ధాన్యాన్ని కొనాలి అంటే కొనేదే లేదని చెప్పడం దారుణమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని అడిగితే అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పియూష్ గోయల్ మాట్లాడారని హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన చులకనచేసి మాట్లాడతారా అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ.. ధాన్యం అంశంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వలేరా అని ప్రశ్నించారు.
గోదాముల సామర్థ్యంపై లేఖ రాయలేదని కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని.. పదిసార్లు లేఖలు రాశామని తెలిపారు. బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని… గోదాములు ఇవ్వాలని లేఖలు రాశామని అన్నారు. ఈ నెల 10 న కూడా కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖ రాశామని, నెలకు 10 మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని లేఖ రాసినట్టు తెలిపారు. నెలకు 4.5 మెట్రిక్ టన్నులే తీసుకుంటున్నారని లేఖ రాసినా… పట్టించుకోలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు పోరాటం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంటే.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మౌనంగా ఉండటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.