కరీంనగర్‌లో సైబర్ క్రైం రేట్ తగ్గించడమే లక్ష్యం : సీపీ

0 7

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడంతోపాటు, వీరి ఉచ్చులో ప్రజలు పడకుండా ఉండేందుకు అవసరమైన కార్యచరణ చేపట్టబోతున్నామని కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ తెలిపారు.

బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నందున వాటిని నిరోధించే దిశగాముందుకు సాగనున్నామన్నారు. సైబర్ నేరగాళ్లు ఓటీపీ నెంబర్లంటూ ఇతరాత్ర ప్రయోగాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయంలో ప్రజలు కూడా చైతన్యవంతం కావల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ సెల్, సైబర్ ల్యాబ్‌ల ద్వారా ఈ నేరాలను డిటెక్ట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కరీంనగర్ కమిషనరేట్‌లో గంజాయి సాగు కావడం లేదని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అయితే ఒరిస్సాలోని మల్కాన్ గిరి, కోరాపుట్ జిల్లాల నుండి ఏపీలోని సీలేరు మీదుగా భద్రాద్రి కొత్తగూడెం నుండి కరీంనగర్ కు తరలిస్తున్నారన్నారు. గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తించామని, వచ్చే సంవత్సరం గంజాయి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గంజాయి వాడకాన్ని నిలువరించేందుకు ఆపరేషన్ డెకాయ్ చేపట్టి కొన్ని ముఠాలను పట్టుకున్నామని, ఇదే విధానాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామన్నారు. ఈ ఏడాది శాంతి భద్రతల విషయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం మరిన్ని పకడ్భందీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అలాగే కరీంనగర్ లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, స్మార్ట్ సిటీలో భాగంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం రూ.23 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులతో అధునాతన సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసి వాటితో ట్రాపిక్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నామన్నారు. కరీంనగర్‌లో వాహనాల వినియోగం కూడా తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను మూడు నెలల్లో పరిష్కరించున్నామని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. అలాగే కరీంనగర్‌లోని వాడవాడలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసు యంత్రాంగంలో క్రమశిక్షణారాహిత్యాన్ని మాత్రం ఉపేక్షించేది లేదని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మర్యాద లేకుండా వ్యవహరిస్తే చర్యలు తీసుకుని తీరుతామని, ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా సరే వారి పట్ల కఠినంగా వ్యవహరించి తీరుతామన్నారు. తాము నమోదు చేస్తున్న కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా అవసరమైన సాక్ష్యాలను సేకరించే విషయంలో సఫలం అవుతున్నామన్నారు. గతంలో కేవలం 2 శాతం మాత్రమే కన్విక్షన్ రేట్ ఉండేదని ఇప్పుడు 30 శాతానికి పెరిగిందన్నారు. రానున్న కాలంలో నిందితులకు శిక్ష పడేందుకు మరింత పకడ్భందీగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents