సిద్దార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మీద హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అయన ఉపయోగించిన భాష, పదం అభ్యంతరకరంగా ఉందని చాలా మంది పేర్కొంటున్నారు. సైనాకు మద్దతుగా, సిద్ధార్థ్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. తాను చేసిన ట్వీట్లో డబల్ మీనింగ్ లేదని సిద్ధార్థ్ వివరణ ఇచ్చినప్పటికీ… వేడి చల్లారలేదు. సైనా నెహ్వాల్ తండ్రి సైతం సిద్ధార్థ్ మీద మండిపడ్డారు.
“బాడ్మింటన్ కోర్టులో నా కుమార్తె దేశానికి చాలా మెడల్స్ అందించింది. మరి, ఈ దేశానికి సిద్ధార్థ్ ఏం చేశాడు?” అని సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ ప్రశ్నించారు. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధార్థ్ అటువంటి పదాలు ఉపయోగించడం బాలేదని స్పష్టంగా చెప్పారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఓ జాతీయ ఛానల్‌తో టెలిఫోన్లో హర్వీర్ సింగ్ మాట్లాడినప్పుడు చోటు చేసుకున్న సందర్భం ఇది.
సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు లేఖ రాయడంతో పాటు అతనిపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించిన జాతీయ మహిళా కమీషన్ నిర్ణయాన్ని హర్వీర్ సింగ్ నెహ్వాల్ స్వాగతించారు. సైనాకు మద్దతుగా జాతీయ మహిళా కమీషన్‌తో పాటు గాయని చిన్మయి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తదితర ప్రముఖులతో పాటు ఎంతో నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు.