నిద్రపోతున్న కొడుకు.. మెలకువ వచ్చి చూసేసరికి..

0 10

నగరంలోని కరేనాహళ్లి ప్రాంతానికి చెందిన శైలజ (30), ఎన్.రాఘవేంద్ర (40) భార్యాభర్తలు. డిసెంబర్ 27న రాఘవేంద్ర అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఫిట్స్ వచ్చి పడిపోయారని, కాసేపటికే చనిపోయారని శైలజ కన్నీరుమున్నీరయింది. ఆమె చెప్పింది నిజమేనని అంతా నమ్మారు. రాఘవేంద్రకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. రాఘవేంద్ర మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తమకు అనుమానాలున్నాయని, విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరపగా.. ఊహించని ప్రత్యక్ష సాక్షి జరిగిందేంటో చెప్పాడు.

ఆ ప్రత్యక్ష సాక్షి మరెవరో కాదు. రాఘవేంద్ర కన్న కొడుకు. పదేళ్ల వయసున్న ఆ పిల్లాడు తండ్రి హత్య జరిగిన రెండు వారాల తర్వాత పోలీసుల ముందు అసలు నిజం బయటపెట్టాడు. ఆ పిల్లాడి కళ్ల ముందే రాఘవేంద్రను అతని భార్య, ఆమె ప్రియుడు, రాఘవేంద్ర అత్త చంపేశారు. రాఘవేంద్రను అడ్డు తొలగించుకునేందుకు శైలజ తన ప్రియుడు హనుమంత, తల్లి లక్ష్మీదేవమ్మతో కలిసి ప్లాన్ చేసింది. పోలీసులు బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా ఆ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.

శైలజ, ఆమె ప్రియుడు హనుమంత కాల్ డేటాపై ఆరా తీశారు. దీంతో.. బాలుడి చెప్పింది నిజమేనని తేలింది. భార్య, ప్రియుడు, ఆమె తల్లి.. ముగ్గురు కలిసి రాఘవేంద్రను పొట్టనపెట్టుకున్నారు. చేనేత వస్త్ర దుకాణంలో పనిచేసే హనుమంతకు, గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే రాఘవేంద్ర భార్య శైలజకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి బాగోతం కొన్నాళ్లకు శైలజ భర్త రాఘవేంద్రకు తెలిసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. భర్తను అడ్డు తొలగించుకోవాలని శైలజ భావించింది. చివరకు ప్రియుడు, తల్లితో కలిసి అనుకున్నంత పని చేసింది. డిసెంబర్ 27న అర్ధరాత్రి 2.15 నిమిషాలకు రాఘవేంద్ర సోదరుడు చంద్రశేఖర్‌కు శైలజ ఫోన్ చేసింది. రాఘవేంద్ర ఫిట్స్ వచ్చి పై నుంచి పడిపోవడంతో దెబ్బలు తగిలాయని చెప్పింది. దీంతో.. చంద్రశేఖర్, అతని తండ్రి హుటాహుటిన రాఘవేంద్ర ఇంటికి వెళ్లారు. అప్పటికే రాఘవేంద్ర చనిపోయాడు. తలకు గాయాలయినట్లు వారు గుర్తించారు.

తొలుత.. ఫిట్స్ కారణంగానే చనిపోయాడని భావించినప్పటికీ అతని చావు వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందేమోనన్న అనుమానం చంద్రశేఖర్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 29న అంటే.. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తమ ఇంటికి ఎవరో ఒకతను వచ్చాడని రాఘవేంద్ర కొడుకు చంద్రశేఖర్‌కు చెప్పాడు. దీంతో.. చంద్రశేఖర్ అనుమానం మరింత బలపడింది. రాఘవేంద్ర ఇంటికి శేఖర్ బయల్దేరి వెళ్లాడు. దగ్గర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. రాత్రి 10.45 నిమిషాలకు ఓ వ్యక్తి రాఘవేంద్ర ఇంట్లోకి వెళ్లినట్లు రికార్డయింది. తన సోదరుడు భార్య, ఆమె తల్లి, ఒక పాప, బాబుతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాఘవేంద్ర సోదరుడు పేర్కొన్నాడు. తన వదిన ఈ ఘటన జరిగాక ఏపీలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని, ఆ సమయంలో తాను సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించానని.. అందుకే ఫిర్యాదు చేయడానికి ఆలస్యమైందని శేఖర్ పోలీసులకు తెలిపాడు.

ఆ పిల్లాడు ఈ ఘటన గురించి పోలీసులకు చెబుతూ.. తాను రాత్రి పడుకున్నానని, అయితే.. అర్ధరాత్రి సమయంలో ఏదో శబ్దం వినిపించి మెలకువ వచ్చిందని.. వెళ్లి చూసేసరికి అమ్మమ్మ నాన్న రెండు కాళ్లను గట్టిగా పట్టుకుందని బాలుడు తెలిపాడు. అమ్మ నాన్న కదలకుండా ఆయనపై కూర్చుని ఉందని, మరో వ్యక్తి చపాతీ కర్రతో నాన్న తలపై కొట్టాడని బాలుడు చెప్పాడు. ఎందుకు నాన్నను కొడుతున్నారని వాళ్లను అడిగానని, అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి కొట్టాడని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని రాఘవేంద్ర కుమారుడు పోలీసులకు జరిగిందంతా వివరించాడు. ఈ విధంగా తండ్రిని చంపేందుకు తల్లి చేసిన కుట్రను కన్న కొడుకే బయటపెట్టాడు. పోలీసులు శైలజను, ఆమె ప్రియుడిని, తల్లిని అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడిన శైలజ ఇలా భర్తను చంపి హంతకురాలిగా మారి చేజేతులా సంసారాన్ని నాశనం చేసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents