ప్రభుత్వం నుంచి ఇబ్బందుల వల్లే టెస్లా కార్ల ఆలస్యం : ఎలన్ మస్క్
ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ టెస్లా భారత్లో ప్రవేశంపై ఇంకా సందిగ్ధత నెలకొంటూనే ఉంది. 2019లోనే కంపెనీ తన కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించాలని భావించినప్పటికీ అధిక దిగుమతి సుంకం ఉందన్న కారణంగా మూడేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో టెస్లా కార్లను తీసుకురావడంపై సంస్థ అధినేత ఎలన్ మస్క్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి భారత్లో టెస్లా కార్ల విడుదల జరుగుతుందా..? ఈ కార్లు బాగుంటాయని, ప్రపంచం అంతటా వీటి ఉనికి ఉండాలని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ బదులిస్తూ.. ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందుల కారణంగానే ఆలస్యమవుతోందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం సైతం మండిపడింది. ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడింది. అయితే, ఎలన్ మస్క్ అభిప్రాయం తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరుపై ప్రతికూలంగా పోస్ట్లు రావడంతో వివాదం పెరిగింది. భారత్లో టెస్లా కార్ల తయారీపై ఎలాంటి హామీ ఇవ్వకుండా దిగుమతి సుంకాలను తగ్గించాలని ఎలన్ మస్క్ అడుగుతున్నారని, ఆటోమొబైల్ రంగంలో ప్రధానగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను, వివిధ చర్యలను చేపట్టిందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.