తప్ప తాగి నడి రోడ్డుపై యువకుల వీరంగం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూర్ చౌరస్తా సమీపంలో సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై తప్పతాగి యువకులు వీరంగం సృష్టించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ప్రయాణికుని పై దాడికి తెగబడ్డారు. తాడూర్ చౌరస్తా నుండి రోడ్డు మళ్ళింపుతో కొంత దూరం ఒకవైపు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. తప్పతాగి యువకులు బైక్ పై ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి డ్రైవర్ కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు దిగి యువకులను వారించబోతుంటే మద్యం మత్తులో ఉన్న యువకుడు ప్రయాణికుడిపై పిడి గుద్దులు చెప్పుతో దాడికి తెగబడ్డారు. దీంతో కొంత సేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడ నుండి యువకులు జారుకున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, దాడికి సంబంధించిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.