పేలిన భారీ అగ్నిపర్వతం.. 800 కిలోమీటర్ల వరకు వినపడిన శబ్ధం
దేశమంతా తెలిసేలా భారీ అగ్నిపర్వతం పేలింది. ఆకాశంలో 20 కి.మీ. ఎత్తుకు ఎగిరింది. విస్పోటన శబ్ధం 800 కిలోమీటర్లకు పైగా వినిపించింది. ఎక్కడో తెలుసా… టోంగాలోని సముద్రం అడుగున భారీ అగ్ని పర్వతం విస్పోటం సంభవించింది. ఈ విస్పోటనంతో ఫిజీ, న్యూజీలాండ్ సహా పలుదేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ విస్పోటనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దీంతో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అక్కడి స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 8 నిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడు భీభత్సంగా ఉందని… దీనికి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిజీలో ‘పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు’ వినిపించాయని రాజధాని సువాలోని అధికారులు చెప్పారు. అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద…
ఆకాశంలో 20 కి.మీ. ఎత్తు వరకు విస్తరించాయని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ చెప్పింది. ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్ని పర్వత శ్రేణికి ఉత్తరాన 65 కి.మీ దూరంలోనే టోంగా రాజధాని ‘నుకులోఫా’ ఉంటుంది. అక్కడ 1.2 మీ. ఎత్తున్న సునామీ అలలు కనిపించాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది. ”దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన వరదలు, తీర ప్రాంతాల్లో అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముందని” నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.