పిండాన్ని పిసికేస్తున్నారు…

విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు

0 32

ప్రయివేటు ఆస్పత్రుల్లోనే అబార్షన్లు.. ఒక్కో అబార్షన్‌కు రూ.40నుండి 60 వేలు వసూళు.. గుట్టుగా జోరందుకున్న కడుపు కోతలు.. విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు

ఇటీవల కరీంనగర్ ఓల్డ్ డీఐజీ బిల్డింగ్ సమీపంలో ఓ ఆర్ఎంపీ వైద్యురాలు అబార్షన్లు చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు వస్తున్నారని తెలిసి సదరు వైద్యురాలు పరారైంది. ఆసుపత్రి తెరిచి చూస్తే నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పటికే ఓ అబార్షన్ చేసినట్లు ఆనవాళ్లు దొరికాయి. ఆ క్లినిక్ లో పూర్తిగా అబార్షన్లకు సంబంధించిన పరికరాలు, మందులు ఉండడం చూస్తే అక్క నిత్యం అదే తంతు సాగుతున్నట్లు అర్థమైంది. ఇది ఈ ఒక్క క్లీనిక్ లోనే కాదు. అబార్షన్లకు పేరొందిన కొందరు ఆర్ఎంపీ డాక్టర్లతోపాటు కొందరు క్వాలిఫైడ్ డాక్టర్ల చీకటి క్లినిక్ లో సైతం సాగుతోంది. ఆడపిల్లల పుట్టుకపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భస్థ శిశువుకు స్కానింగ్ పరీక్షలు జరిపి ఆడపిల్లని తేలితే, అడ్డగోలుగా డబ్బులు దండుకుని కర్కశంగా కడుపులోనే లిపేస్తున్నారు. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో స్కానింగ్ సెంటర్లు ఆడపిల్ల పుట్టుకపై ‘హెచ్చరికలు’ చేస్తూ తల్లి గర్భం నుంచి బయటకు రాకుండా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో గర్భ విచ్ఛిత్తి పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది.

స్కానింగ్ సెంటర్లు సాగిస్తున్న మరణ శాసనాన్ని అడ్డుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమవుతోంది. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలను జంకూ బొండూ లేకుండా నిర్వహిస్తూ.. ఆడపిల్లలకు డబ్బులు గుంజి అబార్షన్లు చేస్తున్నారు. విద్యావంతులే అధికం… భ్రూణ హత్యలకు పాల్పడే వారిలో ఉన్నత చదువులు అభ్యసించినవారే అధికంగా ఉండడం గమనార్హం. గ్రామీణుల కంటే పట్టణవాసులే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గ్రామీణుల కదలికలు వారి బంధువులు, ఇతరులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. పట్టణాల్లో మాత్ర ఈ పరిస్థితి కనిపించదు. దీనిని ఆసరాగా చేసుకుని మధ్యవర్తుల ద్వారా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్యులను సంప్రదించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అందరికీ చెప్పరు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 102 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. గైనకాలజీ వైద్యులు ఆసుపత్రుల్లోనే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి చోటా పీసీ పీఎండీటీ (గర్భస్థ లింగ నిర్ధారణ) చట్టం బోర్డు ఎదురుగా కనిపిస్తుంది. కొందరు నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి భ్రూణహత్యలకు సహకరిస్తున్నారు. కొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలతోపాటు ఆశ కార్యకర్తలు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వచ్చిన వారి అవసరాన్ని బట్టి రూ.10 వేలకుపైగా వసూలు చేసి పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణ చేస్తున్నారు. అనంతరం సంబంధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించి గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడం పరిపాటిగా మారింది. పెట్ స్కాన్ పేరుతో దోపిడీ. గర్భస్థ శిశువుల్లో అవయవ లోపాలను గుర్తించేందుకు ఉత్తర తెలంగాణ మొత్తంలో కరీంనగర్ లోనే రెండు పెటిసాన్ సెంటర్లు ఉన్నాయి. ఆసుపత్రుల్లో స్కాన్ చేస్తున్నవైద్యులు అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక భయం చెప్పి పెట్ స్కానకు పంపుతున్నారు. అక్కడ రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గర్భిణులను స్కానింగ్ కు పంపుతున్నారు. స్కానింగ్ పూర్తయితే 50 శాతం కమీషన్ వైద్యులకు వెళ్తుంది. కమీషన్ల కోసం స్కానింగ్ కు పంపుతూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. చట్టం.. తూతూ మంత్రం.. భ్రూణహత్యలను నిరోధించేందుకు 1994లో చట్టం రూపొందించినా ఈ భ్రూణహత్యల పరంపర ఆగడం లేదు. ఈ చట్ట ప్రకారం రేడియాలజీలో ఎండీ, డీఎ్బ చేసినవారే గర్భస్థ పిండ పరీక్షలు చేయాలి.

కానీ ప్రతీ గైనకాలజిస్టు తమ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఇలా చేయకూడదనే ఉద్దేశంతో 2003, ఫిబ్రవరి 14 నుంచి పలు సవరణలు చేసి చట్టాన్ని మరింత పగడ్బందీగా మార్చారు. కఠినతరమనేలా చట్టం ఉన్నప్పటికీ ఇది అక్రమార్కులకు చుట్టంగానే మారుతోంది. గర్భస్థ శిశులింగ నిర్ధారణను బహిర్గతం చేయడం లేదా గర్భం దాల్చిన వారిలో పిండదశలోనే హత్య చేయడాన్ని నివారించడానికి రూపొందించిన చట్టంలో బాధ్యులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో స్కానింగ్ సెంటర్లలో అక్కమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది.

నిబంధనలు ఇలా…

– గర్భస్థ లింగ నిర్ధారణ కేంద్రంలో ఎన్నిపరికరాలుంటే.. అన్నింటికీ అన్నింటికీ అనుమతి పొందాలి.
– గైనకాలజిస్టు, రేడియోలజిస్టు, సోనాలజిస్టు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో శిక్షణ పొందిన వారికి అనుమతివ్వాలి.
-ప్రతి గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్ష సమాచారాన్ని అధికారికంగా పుస్తకంలో తప్పనిసరిగా నమోదు చేయాలి.
-ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలి.
-జిల్లా స్థాయిలో వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఉల్లంఘనులు…
-అనుమతులు లేకుండానే నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు.
-పరీక్ష నమోదు ప్రక్రియను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు.
-ప్రభుత్వానికి అరకొర పంపిస్తున్నారు.
-సమాచారాన్ని అరకొరగా పొందుపర్చుతున్నా… వైద్యాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
-ఈ విషయంలో కొందరు వైద్యాధికారులకు ప్రతినెలా ముడుపులు అందుతున్నాయనే అవగాహన సమాచారం ఆరోపణలు ఉన్నాయి.
-ఒక పరికరానికి అనుమతి పొంది, ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.
-కొన్ని కేంద్రాల్లో శిక్షణ, అనుభవం లేని వారే టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents