తెలంగాణలో పెరగనున్న ఛార్జీలు.. ఫిబ్రవరి నుంచే అమలు?
తెలంగాణలో మరోసారి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, స్థలాల విలువను 35 శాతం, అపార్ట్ మెంట్ విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీనితో పాటుగా బహిరంగ మార్కెట్ లో విలువలు భారీగా ఉన్న చోట అవసరమైన మేరకు సవరించుకునేదుకు అవకాశం కల్పించనుంది. ఈ ప్రతిపాదనలపై నాలుగైదు రోజుల్లో తుదిరూపు ఇవ్వనున్నట్లు సమాచారం. అన్ని సజావుగా జరిగితే ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా గతేడాది ఆస్తుల మార్కెట్ విలువను ప్రభుత్వం 20 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ఏడాది గడవకముందే మరోసారి మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.