దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం : మంత్రి గంగుల
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ది చెందుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళిత బంధు ఆస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసిన వారు నేడు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ.లు 10 లక్షలు అందజేసిన మహానుభావుడు కే.సి.ఆర్. అని కొనియాడారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా, 6 హర్వెస్టర్లు, 3 జేసిబిలు, 1 డిసిఎం వ్యాన్ లు మంత్రి పంపిణీ చేశారు. ఒక్కో హర్వెస్టర్ రూ.లు 22 లక్షలు, ఒక్కో జేసిబి రూ.లు 34 లక్షలు, డిసిఎం వ్యాన్ రూ.లు 24 లక్షలు కాగా మొత్తంగా 2 కోట్ల 60 లక్షల విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు అందించామని మంత్రి తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసిబిలు, డిసిఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారని అన్నారు. వీటితో లబ్దిదారులు ఆర్థికాభివృద్ది సాధిస్తారని తెలిపారు. అర్హులైన లబ్దిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హార్వేస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, సుంకె రవి శంకర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణా రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి. సురేష్, క్లస్టర్ అధికారులు, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు