తెలంగాణలో రాబోయేది డబల్ ఇంజన్ సర్కారే
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ..ప్రపంచంలోనే భారతదేశానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బీజేపీ ప్రధాని మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. కేంద్రంలో రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలనే ఆకాంక్ష దేశ ప్రజల్లో ఉందని, ఆ దిశగానే నాలుగు రాష్ట్రాలలోబీజేపీ పై విశ్వాసం ఉంచి ఆదరించి ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఘన విజయాన్ని అందించారని తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని అందించిన ఆయా రాష్ట్రాల ప్రజానీకానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో బిజెపి చరిత్ర తిరగరాసిందని, చరిత్రలో నిలిచే విధంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ పాలన, యోగి మార్క్ సుపరిపాలన తోనే ప్రజలందరూ ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు.