సింగరేణిని పైవేటికరించేందుకు కేంద్రం కుట్రలు: ఎమ్మెల్యే
కేంద్ర ప్రభుత్వం విధానాలపై కార్మిక లోకమంతా కన్నెర్రచేసిందని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 48 గంటల సమ్మెలో సింగరేణి కార్మికులు విజయవంతంగా చేపట్టారని రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని కేంద్ర టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 20కోట్ల కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఒక్కతాటిపై నిలిచారన్నారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆలోచన కేంద్రం మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు గండ్ర దామోదర్‌రావు, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, అప్పాల కృష్ణమూర్తి, మండ రమేష్, గండు శ్రావన్, రమేష్ రెడ్డి, శేషగిరి, అచ్చె వేణు, బోడ్దు రవీందర్, బోడ్దుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.