ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని, వాటిని వినియోగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లాలో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మైనారిటీ ముస్లిం మహిళా సంఘాలచే తయారు చేసిన జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఫీవర్ సర్వే నిర్వహణ, మందుల పంపిణీ వ్యాక్సినేషన్ తదితర అంశాల్లో మంచి కృషిచేసిన ఆశ వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని, వాటి స్థానంలో జూట్ బ్యాగ్ లను వినియోగించాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని అధికారులు ఆకస్మిక తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.
ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వినియోగించడానికి జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నామని, దీని కోసం జిల్లా లోని వివిధ మహిళా సంఘాలకు శిక్షణ అందించి యూనిట్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
రెండున్నర లక్షల రూపాయలు వ్యయం చేసి 2 వేలకు పైగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు జ్యూట్ బ్యాగులు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జూట్ బ్యాగుల పంపిణీ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లా అధికారులు వారి శాఖ తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో వినియోగించడానికి, సొంత అవసరాలు వినియోగానికి జ్యూట్ బ్యాగులు ఆర్డర్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న వివిధ వ్యాపారులు తమకు అవసరమైన రీతిలో ఆర్డర్లు అందించి బ్యాగులు తయారు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. ఎస్. లత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.