బాలిక పై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇక నిందితులు అధికార పక్షం వారైతే బాధితుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. తాజాగా బాలికను బర్త్డే పార్టీకి పిలిచిన నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఆదివారం ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని నదియాలోని హన్స్ఖాలీలో బాధిత బాలిక అక్కడి అధికార పార్టీ టీఎంసీ నాయకుడు ఇంట్లో బర్త్డే పార్టీకి గత సోమవారం వెళ్లింది. వేడుక తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతతో ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడి ఒత్తిడి మేరకు మృతదేహాన్ని శవపరీక్ష చేయకుండానే దహనం చేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సోమవారం రాణాఘాట్లో 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా స్పందించారు. దీనిని రాజకీయం చేయొద్దని, నిందితులు ఏ పార్టీ వారైనా కఠిన శిక్ష పడుతుందని చెప్పారు.