రాష్ట్రపతి ఎన్నిక…

 విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా

0 127,456

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక‌ యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్‌ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్‌ సిన్హా కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 27న ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.
శరద్‌ పవార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీకి కాంగ్రెస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఏఐఎంఐఎం, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్‌ తదితర పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేశ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ బెనర్జీ, డీఎంకే నుంచి తిరుచి శివ, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ నుంచి డి.రాజా తదితరులు పాల్గొన్నారు. తెరాస, బిజు జనతాదళ్‌, ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌లు ఈ భేటీకి కూడా దూరంగా ఉన్నాయి. జూన్‌ 15న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన విపక్షాల భేటీకి కూడా ఈ పార్టీలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read :

యశ్వంత్ సిన్హా గురించి ఈ విషయాలు తెలుసా?
నవంబర్‌ 6, 1937లో జన్మించిన యశ్వంత్ సిన్హా విద్యాభ్యాసమంతా బిహార్‌లోని పట్నాలో కొనసాగింది. 1958లో పట్నా యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆయన.. 1960 వరకు బోధన కొనసాగించారు. ఆ తర్వాత 1960లో సివిల్స్‌ పాసై ఐఏఎస్‌గా సేవలందించారు. దాదాపు 24 ఏళ్ల పాటు అనేక పోస్టుల్లో పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజకీయ అరంగేట్రం జనతా పార్టీతోనే మొదలైంది. 1986లో ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సిన్హా.. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వీపీ సింగ్‌ సారథ్యంలో జనతాదళ్‌ ఏర్పాటు కాగా.. ఆ పార్టీకి సిన్హా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత జనతాదళ్‌ నుంచి చీలిపోయి సమాజ్‌వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్‌ కేబినెట్‌లో 1990 నవంబర్‌ నుంచి 1991 జూన్‌ వరకు తొలిసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1996లో భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1998 మార్చిలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో మళ్లీ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ స్థానం నుంచి తరచూ పోటీ చేసే యశ్వంత్ సిన్హా స్థానాన్ని.. 2014లో భాజపా ఆయనకు నిరాకరించింది. ఆయన కుమారుడు జయంత్‌ను అక్కడి నుంచి బరిలో దించింది. అయితే, ఆ తర్వాత 2018లో పట్నాలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసిన సిన్హా.. క్రియాశీల రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. కానీ, 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ.. మంగళవారం (ఈరోజు) తృణమూల్‌‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. యశ్వంత్‌ సిన్హాకు భార్య నీలిమ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. వాజ్‌పేయీ హయాంలో, మోదీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు. ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం భాజపాలో కొనసాగుతుండటం గమనార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents