ట్రాఫిక్ బూత్‌ని ఢీకొట్టిన లారీ.. నడిరోడ్డుపై బీభత్సం..
రోడ్డుపైకి వాహనం తీసుకెళ్తునప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం అప్రమత్తతో వ్యవహరించాలి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం మంచుకొస్తుందో తెలియదు. మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సక్రమంగా వెళ్లినా.. కొన్నికొన్ని సార్లు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మన తప్పు లేకున్నా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అవతలి వ్యక్తి చేసిన పొరపాటు ఒక్కోసారి మన ప్రాణం మీదకు వస్తుంది. ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. వైరా పాత సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ట్రాఫిక్ బూత్‌ని లారీ ఢీకొట్టింది. అది అమాంతం ఎగిరి వచ్చి.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై పడింది. ట్రాఫిక్ బూత్ బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐతే లారీ వెనకభాగంలో ఉన్న ఏదో వస్తువు బలంగా తాకడం వల్లే ట్రాఫిక్ బూతు కిందపడిపోయినట్లు తెలుస్తోంది.