రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిభందనలు పాటించండి
జిల్లా కలెక్టర్ కె. శశాంక
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం ఆర్టీసి డిపో-2 లో జరుగుతున్న 32 వ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని, మద్యం సేవించరాదని డ్రైవర్లకు కలెక్టర్ సూచించారు. ప్రమాదాలు జరుగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టిసి బస్సు చక్రాలు ప్రగతి రథచక్రాలని, కరీంనగర్ రీజియన్ కు సంబంధించి 2014 నుండి జనవరి, 2021 వరకు ప్రమాదాల వివరాలు పరిశీలిస్తే కరీంనగర్ లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు. అదే విధంగా ఒరవడిని ముందుముందు కూడా కొనసాగించి ప్రమాద రహిత రీజియన్ గా గుర్తించబడేవిధంగా అందరూ పనిచేయాలని అన్నారు. డ్రైవర్లు మంచి ఆరోగ్య అలవాట్లు అలవరుచుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం కరీంనగర్ జోన్ స్థాయిలో అత్యంత ప్రమాద రహిత సర్వీసు నిర్వర్తించిన ముగ్గురు డ్రైవర్లను నగదు పురస్కారం మరియు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా కమీషనర్ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, పి.వి.మునిశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( హైదరాబాద్ మరియు కరీంనగర్ జోన్లు) డిపో మేనేజర్లు పాల్గొన్నారు.