ఇక చెలరేగి ఆడండి : క్రికెట్‌కు మద్దతు పలికిన తాలిబన్లు… వరల్డ్ కప్‌కు సపోర్ట్
అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకొని తాలిబన్లు రాజ్యాధికారం సాధించగానే ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది. అక్కడ ఏ కార్యాకలాపాలు కూడా తాలిబన్ల అనుమతి లేనిదే జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ సూపర్ 12కు నేరుగా అర్హత సాధించిన అఫ్గానిస్తాన్ జట్టు అసలు క్రికెట్ ఆడుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అఫ్గాన్ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ‘ది హండ్రెడ్’ లీగ్ ఆడుతున్నారు. వీళ్లు అక్కడి నుంచే తమ దేశాన్ని రక్షించాలని ప్రపంచ నేతలను సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడంతో వాళ్లు తిరిగి అఫ్గానిస్తాన్ వస్తారా? అఫ్గాన్‌లో ఉన్న క్రికెటర్లు వెళ్లి యూఏఈలో వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ అనుమానాలకు తెరదించుతూ తాలిబన్లు అఫ్దాన్ క్రికెట్‌కు పూర్తి మద్దతు తెలపడం విశేషం. అసలు ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ పెద్దలను చర్చలకు పిలవడం గమనార్హం. ఆదివారం తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీతో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లు సమావేశమయ్యారు. అఫ్గాన్ త్వరలో ఆడబోయే సిరీస్‌లు, విదేశీ పర్యటనల గురించి వెల్లడించారు. తమ జట్టు నేరుగా వరల్డ్ కప్ సూపర్ 12కు అర్హత సాధించిన విషయాన్ని కూడా వెల్లడించారు.
అఫ్గానిస్తాన్ క్రికెట్ కెప్టెన్, బోర్డు పెద్దల మాటలను విన్న తాలిబన్ నాయకుడు దేశ క్రికెటర్లకు పూర్తి బరోసా ఇచ్చినట్లు తెలుస్తున్నది. క్రికెటర్లకు తాలిబన్లు పూర్తి మద్దతు పలుకుతున్నదని.. మీరు చెలరేగి ఆడి దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని వారిని ఉత్సాహపర్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రపంచ దేశాల్లో అఫ్దాన్ పట్ల వ్యతిరేక భావం నెలకొన్నది. మీ క్రీడా ప్రతిభను వరల్డ్ కప్ వేదికగా చాటి మంచి పేరు తేవాలని తాలిబన్ నాయకుడు కోరినట్లు తెలుస్తున్నది. తాలిబన్ల నుంచి నేరుగా అనుమతి రావడంతో అఫ్గాన్ జట్టుకు ఇక యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్ అనుమతి లభించినట్లే అని సమాచారం. అఫ్గాన్ క్రికెటర్లకే కాకుండా అందరు క్రీడాకారులకు ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హుక్కానీ భరోసా ఇచ్చారు.
అఫ్గాన్ క్రికెటర్లకు భరోసా ఇవ్వడం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉన్నది. అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ మొదలైది హుక్కానీ అధ్యక్షతనే. 1996-2001 మధ్య హుక్కానీ క్రికెట్ అభివృద్దికి కృషి చేశారు. తాలిబన్ నాయకుడిగా ఉంటూనే.. క్రికెట్ పట్ల కూడా అతడు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. ఆ తర్వాత భారత్, బీసీసీఐ సహకారంతో అఫ్గానిస్తాన్ క్రికెట్లో మరింత వేగంగా అభివృద్ది చెందింది. అయితే అప్గాన్‌లో నెలకొన్న పరిస్థితులు పక్కన ఉన్న పాకిస్తాన్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. చాలా ఏండ్ల తర్వాత ఇటీవలే విదేశీ క్రికెట్ బోర్డులు పాక్ గడ్డపై క్రికెట్ ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే పొరుగున ఉన్న అఫ్గాన్‌లో పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరుగనున్న న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్ల పర్యటనపై ప్రభావం పడిండి. తమ జట్లను పాకిస్తాన్ పంపడానికి ఆ రెండు బోర్డులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తున్నది.