ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడే సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు అయితే తమ వాహనాల్లో వెళ్లిపోతారు. సొంత కారు లేనివాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకపోతే.. వాళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆటో లేదంటే క్యాబ్. ఇదివరకు అంటే రోడ్డు మీదికి వచ్చి క్యాబ్ కోసం ఎదురు చూసేవాళ్లు. కానీ.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో బుక్ చేస్తే.. ఇంటికే క్యాబ్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఉబెర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులు చాలానే ఉన్నాయి.
అయితే.. ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవాలంటే ఇక నుంచి ఉబెర్ యాప్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ద్వారా కూడా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసమే వాట్సప్ చాట్‌బాట్ అనే సరికొత్త ఫెసిలిటీని ప్రారంభించింది.
ఇండియాలో ఈ ఫీచర్ తొలిసారి లక్నోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్‌బాట్ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అన్ని రీజనల్ భాషల్లో చాట్‌బాట్‌ను డెవలప్ చేయనున్నారు. అలాగే.. లక్నో తర్వాత మిగితా అన్ని మెట్రో సిటీలలో ఈ ఫెసిలిటీని త్వరలోనే వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఉబెర్ బిజినెస్ అకౌంట్ నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసం ఉబెర్ సంస్థ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. డైరెక్ట్‌గా ఉబెర్ వాట్సప్ చాట్ ఓపెన్ అవుతుంది. అందులో పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫేర్, కారు డ్రైవర్ సమాచారాన్ని చాట్‌బాట్ అందిస్తుంది.
ఉబెర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఈ ఆప్షన్ ద్వారా వాట్సప్ ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ యాప్‌లో ఏ ఫెసిలిటీలు ఉంటాయో.. ఈ వాట్సప్ చాట్‌బాట్‌లో కూడా అన్ని ఫెసిలిటీలు ఉంటాయని ఉబెర్ సంస్థ వెల్లడించింది. డ్రైవర్ వివరాలు, కారు నెంబర్, లొకేషన్ ట్రాకింగ్ అన్ని వివరాలను చాట్‌బాట్‌లో కూడా తెలుసుకోవచ్చు.