ఫ్రెండ్ భార్యతో ఫోన్‌లో ఆ ముచ్చట్లు..భర్త ఏం చేశాడంటే
స్నేహితుడి వల్ల కష్టం వస్తుందని, తన కాపురంలో కలతలొస్తాయని ఎవరూ ఊహించరు. కానీ తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో అదే జరిగింది. స్నేహితుడు తన భార్యతో ఫోన్ కాల్‌లో కామ సంభాషణలు చేస్తున్నాడని తెలిసి తట్టుకోలేక భర్త హంతకుడిగా మారి అతని స్నేహితుడిని చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. నమక్కల్ జిల్లా కుమరపాలయం ప్రాంతానికి చెందిన వెంకటేష్ తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఆ కంపెనీ వాళ్లు ఇచ్చిన గదిలో ఉంటూ వారాంతంలో భార్యతో గడిపేందుకు ఇంటికి వెళుతుండేవాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో భార్యతో పాటే ఉంటూ సరదాగా భార్యతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళుతుండేవాడు.
వెంకటేష్‌కు అతని ఇంటి దగ్గర్లోనే ఉండే దినేశ్వరన్ అనే స్నేహితుడు ఉన్నాడు. అప్పుడప్పుడూ వెంకటేష్‌తో కలిసి అతని ఇంటికి వెళుతుండేవాడు. ఆ సమయంలోనే అతని భార్యతో దినేశ్వరన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వెంకటేష్‌కు తెలియకుండా ఒకరి నంబర్ మరొకరు తీసుకునేంత వరకూ వెళ్లింది. వెంకటేష్ ఇంట్లో లేనప్పుడు అతని భార్యకు దినేశ్వరన్ కాల్ చేసేవాడు. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలతో పాటు సెక్స్ టాక్ కూడా నడిచాయి. ఈ విషయం కొన్ని రోజులకు వెంకటేష్‌కు తెలిసింది. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. అప్పటి నుంచి వెంకటేష్ భార్య దినేశ్వరన్‌తో మాట్లాడటం మానేసింది. అయినప్పటికీ దినేశ్వరన్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో.. వెంకటేష్‌కు దినేశ్వరన్ గురించి తెలిసింది. స్నేహితుడని ఇంటికి రానిస్తే ఇంతకు ఒడిగడతాడా అని వెంకటేష్ రగిలిపోయాడు.
ప్రతీ ఆదివారంలానే నవంబర్ 14న కూడా వెంకటేష్ భార్యతో గడిపేందుకు ఇంటికొచ్చాడు. అదేరోజు.. ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లికి వెళుతున్నానని చెప్పిన దినేశ్వరన్ రెండు రోజులయినా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో.. ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు తెలిసిన ప్రతిచోటా కొడుకు జాడ కోసం వెతుకులాట సాగించారు. అయినా దినేశ్వరన్ ఆచూకీ దొరకలేదు. దీంతో.. దినేశ్వరన్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కుమరపాలయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడుకు విషయంలో ఎవరిపైనా అనుమానం ఉందా అని పోలీసులు అడగ్గా.. వెంకటేష్ పేరు చెప్పారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తన భార్యతో దినేశ్వరన్ సెక్సువల్ టాక్ చేశాడని.. దీంతో అతనిని కెనాల్‌లోకి తోసేసి చంపేసినట్లు చెప్పాడు. ఈ హత్యలో నిందితుడికి సహకరించిన మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో దినేశ్వరన్ మృతదేహం కోసం గాలించగా ఎట్టకేలకు ఒక దగ్గర అతని మృతదేహం లభ్యమైంది. ఇలా స్నేహితుడి చేతిలోనే దినేశ్వరన్ దారుణ హత్యకు గురి కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.