గర్భిణీ అక్క తల నరికి.. సెల్ఫీ తీసుకున్న తమ్ముడు
గర్భం దాల్చిన అక్క తల నరికిన తమ్ముడు సెల్ఫీ తీసుకున్నాడు. దీనికి తల్లి కూడా సహకరించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 19 ఏండ్ల కీర్తి థోర్ ఈ ఏడాది జూన్లో ఇంటి నుంచి పారిపోయింది. వీర్గావ్ ప్రాంతంలో భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. కులాంతర వివాహంపై ఆమె కుటుంబం ఆగ్రహంతో ఉన్నది.
వారం కిందట కీర్తి తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. తాను గర్భందాల్చానని, తన ఇంటికి రమ్మని కోరింది. దీంతో ఆమె తల్లి వీర్గావ్కు వచ్చి వెళ్లింది. ఈ నెల 5న ఆదివారం తన కుమారుడితో కలిసి తల్లి మళ్లీ కుమార్తె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి సమీపంలోని పొలంలో అత్తతో కలిసి కీర్తి పని చేస్తున్నది. తల్లి, తమ్ముడి రాకను గమనించి పొలం నుంచి పరుగున ఇంటికి వచ్చింది. వారిని పలకరించి తాగేందుకు మంచినీళ్లు ఇచ్చింది.
అనంతరం కీర్తి వంట గదిలో టీ చేస్తున్నది. ఇంతలో తల్లి, తమ్ముడు వంటగదిలోకి వచ్చారు. తల్లి కీర్తి కాళ్లు గట్టిగా పట్టుకోగా కుమారుడు తన వెంట తెచ్చిన పదుదైన కొడవలితో వెనుక నుంచి అక్క తల నరికాడు. ఇంట్లో అనారోగ్యంతో పడుకున్న కీర్తి భర్త ఈ శబ్దాలకు నిద్ర లేచాడు. వంటగదిలోకి వచ్చి చూడగా కీర్తి తల నరికి చంపడం చూసి షాకయ్యాడు. మరోవైపు కీర్తి తమ్ముడు బావను కూడా చంపేందుకు ప్రయత్నించగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. చేతులోని తలతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఊపుతూ స్థానికులకు చూపాడు. తర్వాత తల్లితో కలిసి అక్క తలతో వీర్గావ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్యగా పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.