తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత వారు మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు బిఎస్పీ పార్టీనీ అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయి, కానీ తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బిఎస్పీ విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహుజనుల ఆత్మగౌరవాన్ని ఏనుగు మీద అసెంబ్లీ స్థానానికి తీసుకుపోతామన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగస్తులకు తొమ్మిదో తారీకు అయినా జీతాలు లేవని ఎద్దేవా చేశారు. గవర్నమెంటు అసైన్డ్ భూములలో మీ ఆఫీస్ లు కట్టు కుంటున్నారు. కొన్ని పత్రిక విలేకరులను ఉన్నది ఉన్నట్లు రాస్తే వాళ్ల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానల్ విలేకరులను బెదిరిస్తున్నారని, ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది ఖరారు చేసుకున్నారని అన్నారు.
ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా.? ఏనుగు మీద ఓటు వేసి గెలిపిద్దామా..? అని ప్రజలు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు రైతుబంధుకు, కళ్యాణ లక్ష్మికి లొంగేటోల్లు కాదని వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకునే రోజులు పోయాయన్నారు. ఇక మీ ఆటలు చెల్లవు అంటూ సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి, శ్రీశైలం కరామకృష్ణ, రమేష్ బుగ్గ స్వామి తదితరులు పాల్గొన్నారు.