బండి సంజయ్‌ను తరిమి కొట్టాం.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
రైతులకు అసత్య ప్రచారం చేయడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రజలు తరిమికొట్టారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సూర్యాపేట నుంచి పారిపోయారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిప్పర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో రైతుబంధు వారోత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక విధాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని చెప్పడంతో రైతులు ఆత్మహత్య చేసుకోగా, నల్లచట్టాలు తీసుకురావడంతో నిరసన తెలిపిన దాదాపుగా700మంది రైతులు మరణించారని విచారం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారని అన్నారు. కాళేశ్వర్ ప్రాజెక్టు నిర్మించారని, రూ.10వేల కోట్లతో రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్నారన్నారు. ఏడేళ్ళలో రూ.50 వేల కోట్లు, రైతుబంధు కింద మరో 50 వేల కోట్లు సహాయం అందించి కేసీఆర్ అపరభగీరథుడు అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు.
రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనభరిచిన వారికి ఎమ్మెల్యే చేతులతో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాశం రాంరెడ్డి, నల్లగొండ మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎంపీపీ విజయలక్ష్మీ, జడ్పీ ఫ్లోర్ లీడర్, వ్యవసాయం శాఖ అధికారులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.