ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు….నలుగురికి తీవ్ర గాయాలు
హుజురాబాద్, వరంగల్ రోడ్డు శివారులో పెద్ద పాపయపల్లి క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు హుజూరాబాద్ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…. జమ్మికుంట మండలంలోని కోరపల్లికి చెందిన రాగుల మధు, ఆరెల్లి శ్యామ్, రాగుల మహేందర్, ఆరెల్లి విజేందర్ వీరంతా కలిసి కారులో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ కి చెందిన ఆటో రాజశేఖర్ ఇంటి వద్ద ఓ కార్యక్రమానికి వెళుతుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు వివరించారు. కాగా కారులో ముందు సీట్లో కూర్చున ఆటో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక భాగంలో కూర్చున శ్యామ్, మహేందర్, విజేందర్ లకు తీవ్ర గాయాలయ్యాయి.
వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రాగుల మధు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద సంఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు ద్వారా చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి తరలించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య సేవల కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా చొరవచూపారు.