ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న వివో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. 2022 స్పాన్సర్ షిప్ హక్కులు టాటాకు దక్కాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ ఏడాది నుంచి టాటా గ్రూప్ సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 లీగ్ నుండి ఈ ఒప్పందం అమలు కానుందని ఆయనన్నారు. ఇండియాకు చెందిన కంపెనీ కావడంతో టాటా కంపెనీని నియామకం చేసినట్టు బ్రిజేష్ పటేల్ తెలిపారు.
కాగా, 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ హక్కులను వివో కొనుక్కుంది. అయితే 2020 సీజన్ సమయంలో గాల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. దీని స్థానంలో ఆ సమయంలో వీవో డ్రీమ్ 11 కు స్పాన్సర్ గా వ్యవహరించింది. కానీ తర్వాత సీజన్ లో వివోనే మళ్ళీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా కొనసాగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ ద్వారా టాటా నుండి రూ. 350 కోట్ల వరకు పొందనుందని సమాచారం. కాగా, ఈ ఏడాది జరగబోయే టోర్నీకి సంబంధించి ప్లేయర్ల మెగా ఆక్షన్ ఫిబ్రవరిలో బెంగళూరులో జరగనుందని సమాచారం. ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లతో సహా మొత్తం 10 జట్లు పోటీపడతున్నాయి. కాగా ఐపీఎల్ 2022లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.