అక్రమ వడ్డీ వ్యాపారంపై పోలీసుల ఉక్కుపాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తూ వారి వడ్డీ వ్యాపారం బాగోతాన్ని వెలికి తీస్తుండడంతో మిగతా వడ్డీ వ్యాపారుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలంలో రెండు రోజులలో ఇద్దరు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో నగదుతో పాటు వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో సీసీఎస్ పోలీసులు బుధవారం సోదాలు చేపట్టి, ప్రామీసరి నోట్లు, కొంత నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా నమ్మదగిన సమాచారం మేరకు గురువారం చందుర్తి పోలీసులు మండల కేంద్రంలో ఓ మహిళా ఇంట్లో సోదాలు జరిపి, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక వడ్డీ రేట్లకు ప్రామిసరి నోట్లు, సాదా బైనామా రాయించుకుని అమాయక ప్రజల వద్ద నుండి అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేయగా దానికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 1, 58, 55, 400 విలువ ప్రామిసరి నోట్లు, 44, 29, 000 విలువ గల సాదా బైనామా కాగితాలు, 50 వేల విలువ గల నగదు, ఒక కాష్ కౌంటింగ్ మిషన్, మొత్తం 2, 03, 34, 400 విలువ ఆస్తిని స్వాధీనం చేసుకుని నిందితురాలిపై తెలంగాణ మనీ ల్యాండర్ ఆక్ట్ 1349 కింద కేసు నమోదు చేసినట్లు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.