50 ఎకరాలు అమ్మినా.. కరోనాను జయించలేక రైతు మరణం
కరోనా మహమ్మారి ఎంతో మంది కుటుంబాల్లో చీకటి నింపింది. ఆస్తులు తాకట్టు పెట్టి, ఉన్నవి లేనివి అమ్మినా కూడా ప్రాణాలు దక్కించుకోలేక పోయారు. తన ఆత్మీయులను కోల్పోవడమే కాకుండా ఆస్తులను కూడా కోల్పోయిన అభాగ్యులెందరో ఉన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేర్పించి తమ తాహతుకు మించి వైద్యం చేయించి చాలా మంది అప్పుల పాలయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురిని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. సెకండ్ వేవ్ సమయంలో మనకు తెలిసిన వారో, మన కుటుంబ సభ్యులో, మన సన్నిహితులో ఎవరో ఒకరు మరణించడం జరిగింది. కరోనా మహమ్మారి వదిలేసిన విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఆస్తులు, పొలాలు అమ్ముకున్నా కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు దక్కించుకోలేదు ఓ రైతు. ఈ హృదయాన్ని కలిచి వేసే సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రైతు ధర్మజయ్ ని కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు 50 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి దాదాపు రూ.8 కోట్ల ఖర్చుపెట్టినా బతికించలేకపోయారు. గతేడాది మే2న రైతు ధర్మజయ్ కి కరోనా సోకింది. ఊపిరితిత్తుల్లో సమస్యలతో పరిస్థితి విషమించడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రోజకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తూ దాదాపుగా 8 నెలలుగా వైద్యం అందించారు. లండన్ నుంచి డాక్టర్లను తీసుకువచ్చినా అతని ఆరోగ్యం బాగుపడలేదు. ఇటీవల తన ప్రాణం వదిలాడు.