మద్యం మత్తులో పొట్టేలు తలకు బదులుగా మనిషి తల నరికేశాడు.
మద్యం నిషా ఇచ్చే కిక్కే వేరంటారు మందుబాబులు. చుక్కలేనిదే మా జీవితం లేదంటూ తెల్లారింది అనగానే ముందుగా చుక్కే వేసుకుంటారు. రాత్రి నిదరోయే ముందు సైతం నిషా గొంతులో దిగాల్సిందే. కొందరు మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఎదైనా పనిచేస్తే అది అంతే సంగతులు. పీకల దాకా తాగిన ఓ వ్యక్తి చేసిన పనికి ఓ ఊరంతా షాక్ తింది. అంతేకాదు ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పండుగనాడు ఏర్పాటు చేసిన జంతుబలి.. ఓ వ్యక్తిని బలితీసుకుంది. అందుకు కారణం మద్యం మత్తు. వివరాల్లోకి వెళితే…. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లె మండలం వలసపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో కనుమ పండుగను కూడా ఘనంగా జరుపుకుంటారు.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి ఘనంగా నిర్వహించుకుంటున్నారు గ్రామస్థులు. ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇవ్వడం గ్రామస్థుల ఆనవాయితీ. అర్ధరాత్రి ఈ జంతుబలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇంతలోనే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎవరూ కలలోనైనా ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పీకల దాకా మద్యం సేవించిన వ్యక్తి పొరపాటుకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. జంతు బలికోసం పొట్టేలుని పట్టుకొని ఉన్నాడు తలారి సురేష్ (35). పొట్టేలు నరికేందుకు చలపతి అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే పీకలదాకా మందుతాగి ఉన్న చలపతి. ఆ మత్తులో పోట్టేలు అనుకొని సురేష్ తల నరికేశాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలేమైందో తెలుసుకునేలోపే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రామస్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం మద్యం మత్తులోనే జరిగిందా..? లేక కావాలని ఎవరైనా చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. జంతుబలి కాస్తా నరబలి అయిపయిందని పలువురు అంటున్నారు. మరోవైపు మద్యం మత్తు ఓ కుటుంబానికి పెద్దదిక్కులేకుండా చేసిందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు సురేష్ మృతితో అతడి భార్యాబిడ్డలు శోకసంద్రంలో మునిగిపోయారు.