అదరగొట్టిన ఆంధ్ర ఫ్యామిలీ.. కాబోయే అల్లుడికి 365 వంటకాలతో విందు
ఉభయ గోదావరి జిల్లా వాసుల ఆతిథ్యం గురించి తెలిసిందే. ఇంటికొచ్చిన అతిథులకు తమ ప్రత్యేక వంటకాల రుచి చూపించంకుండా వదిలిపెట్టరు. ఇక సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చే కొత్త అల్లుళ్ల సంగతి సరే సరి. స్పెషల్ వంటకాలను కొసరికొసరి వడ్డించి భుక్తాయాసం తెప్పిస్తారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంకు చెందిన ఓ కుటుంబం కూడా వందల రకాల వంటలతో వార్తల్లో నిలిచారు. పండగపూట తమ ఇంటికి వచ్చిన కాబోయే అల్లుడి కోసం ఏకంగా 365 రకాల వంటకాలు సిద్ధం చేశారు. కాగా కాబోయే వధూవరులను కూర్చోబెట్టి, వారి ఎదురుగా టేబుళ్లపై పరిచిన ఫుడ్ ఐటెమ్స్ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ దంపతులు.. తమ కుమారుడు సాయికృష్ణను బంగారం వ్యాపారి ఆటం వెంకటేశ్వరరావు, మాధవిల కుమార్తె కుందవికి ఇచ్చి వివాహం చేయనున్నారు. అయితే పెళ్లికి ముందే సంక్రాంతి పండగ రావడంతో పెళ్లికూతురు తాత ఆచంట గోవింద్, అమ్మమ్మ నాగమణి మనవడికి ఈ విధంగా స్పెషల్ ట్రీట్ ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో వధువు, వరుడితో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాబోయే అల్లుడిపై ప్రేమను చూపించేందుకే ఏడాదిలోని మొత్తం రోజులు పరిగణనలోకి తీసుకుని 365 రకాల ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేసినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. పండగ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
ఇక ఈ ఫుడ్ మెనూలో 30 రకాల కూరలు, అన్నం, పులిహోర, బిర్యాని, సంప్రదాయ గోదావరి మిఠాయిలు, హాట్ అండ్ కోల్డ్ బెవరేజెస్, బిస్కెట్లు, పండ్లు, కేక్స్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.