ఆదివారం ఉదయం చికెన్ కొనేందుకు బజారుకు వెళ్లాడు.. సాయంత్రానికి రూ.12 కోట్లకు అధిపతి అయ్యాడు..

ఎంత కష్టపడ్డా కాలం కలిసి రావాలనే మాటను కొన్ని లక్షల సార్లు వినే ఉంటారు. ప్రతీ మనిషి జీవితంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని అసంతృప్తి చెందే పరిస్థితి ఏదో ఒక సందర్భంలో రావడం సహజం.కానీ.. ఏదో ఒక రోజు తనది కాకపోతుందా అనే ఆశతో ఆ అసంతృప్తిని మరిచి కాలం వెళ్లదీస్తుంటారు. ఆ కాలం ఈ పెద్దాయనకు కలిసొచ్చింది. అంతేకాదు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసింది. కొందరికి అదృష్టం జలగలా పట్టుకుంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి కూడా అలానే పట్టుకుంది. ఈ పెద్దాయన పేరు సదానందన్. ఊరు కేరళలోని కొట్టాయంకు సమీపంలోని కుడయంపడి. కేరళలో(Kerala) క్రిస్మస్-న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ లాటరీ (Lottery) నిర్వహించారు. ఈ లాటరీలో సదానందన్ అలియాస్ సదన్ జాక్‌పాట్ కొట్టాడు. లాటరీలో విజేతగా నిలిచి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.

పెయింటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో రెక్కల కష్టంపై బతుకీడిస్తున్న ఆ కుటుంబం జీవితం ఇక నుంచి పూర్తిగా మారిపోనుంది. సదానందన్ గెలుచుకున్న ఆ లాటరీ టికెట్ కొనడం కూడా చిత్రంగానే జరిగింది. సదానందన్ మాంసం కొనుగోలు చేసేందుకు ఆదివారం ఉదయం బజారుకు వెళ్లాడు. అయితే.. చేతిలో 500 రూపాయలు మాత్రమే ఉండటంతో.. తను, తన భార్య వండుకుని తినేందుకు కొనే ఆ కాస్త మాంసానికి మాంసం దుకాణంలో చిల్లర ఇస్తారో లేదోనని సందేహపడిన సదానందన్ ఆ 500 నోటుకు చిల్లర కోసం రోడ్డు పక్కన లాటరీ టికెట్ అమ్మతున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

అదే రోజు సాయంత్రం అతను కొన్న లాటరీ టికెట్‌కు సంబంధించి ‘డ్రా’ తీసి ఫలితాలను ప్రకటించారు. చూస్తే ఏముంది.. చిల్లర కోసం సదానందన్ కొన్న ఆ లాటరీ టికెటే అతనికి ఊహించని లక్ తెచ్చి పెట్టింది. రోజువారీ రెక్కల కష్టం మీద బతికే ఆ పెయింటర్‌ను కోటీశ్వరుడిని చేసింది. చిత్రంగా ఉన్నా ఇది వాస్తవం. సదానందన్ కొన్న ఆ లాటరీ టికెట్ నంబర్ ‘XG 218582’. ఈ టికెట్ కొన్న గంటల వ్యవధిలోనే అదృష్ట లక్ష్మి సదానందన్ కుటుంబాన్ని వరించింది.

సదానందన్ లక్కును చూసి ‘నక్క తోకను తొక్కి వచ్చి ఉంటాడు’ అని కొందరంటుంటే.. ‘పొద్దునే లేచి ఎవరి ముఖం చూశాడో’ అని మరికొందరు అనుకుంటున్నారు. కుడయంపడిలో ఓ చిన్న ఇంట్లో సదానందన్ కుటుంబం నివాసం ఉంటుంది. అతనికి భార్య రాజమ్మ, ఇద్దరు కొడుకులున్నారు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు కావడంతో చెరొక చోట స్థిరపడ్డారు. ఆ చిన్న ఇంట్లో సదానందన్, అతని భార్య మాత్రమే ఉంటున్నారు. ఈ వచ్చిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావని సదానందన్‌ను అడగ్గా.. తను, తన భార్య ఉండేందుకు మంచి ఇల్లు కట్టుకున్నామని, మిగిలిన డబ్బుతో తమ కొడుకుల కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో అది చేస్తానని.. ఇద్దరు కొడుకుల సలహాతో ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఏదేమైనా.. అదృష్టం అంటే సదానందన్‌దే. అతని అదృష్టాన్ని చూసి ఎవరూ అసూయపడకుండా ఉండాలని, ఇన్నాళ్లు పడిన కష్టాలను మర్చిపోయి ఆ కుటుంబం ఇకపై సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents