కేరళలో మళ్లీ కరోనా కలవరం
కరోనా కేసులు కేరళను కలవరపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. అక్కడ పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కేసులు ఒక్క కేరళలోనే వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా 2,876 మంది కరోనా బారిన పడితే.. కేరళలోనే 1,193 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 4.34 శాతంగా ఉంది. నిన్న 27,465 టెస్టులు చేశారు. రాష్ట్రంలో మరో 18 మంది కరోనాకు బలయ్యారు. కొన్ని కారణాలతో గతంలో చనిపోయిన వారి వివరాలను కరోనా మరణాల జాబితాలో చేర్చలేదు. అందులో 54 మందిని తాజాగా ఆ లిస్టులో చేర్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 66,958కి పెరిగినట్టయింది. యాక్టివ్ కేసులు 8,064 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లోనూ కేరళలోనే ఎక్కువుండడం ఆందోళన కలిగించే అంశం.