ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ల బస్సుపై దుండగుల దాడి
ముంబైలో మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటనతో క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే ముంబైలోని స్టేడియాలలో ఆయా జట్ల ఫ్రాంచైజీలు ప్రాక్టీసు చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది లీగ్ మ్యాచ్‌లను కేవలం నాలుగు స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్ డీవై పాటిల్‌లతో పాటు పుణేలోని ఎంసీఏ స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా సన్నాహకం కోసం మిగిలిన జట్లతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్లు కూడా ముంబైకు చేరుకున్నారు. వారు ప్రస్తుతం ముంబైలోని తాజ్ హోటల్‌లో బస చేస్తున్నారు. అక్కడే వారి బస్సును కూడా నిలిపి ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ప్రాంతీయ పార్టీకి చెందిన కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బస్సుపై దాడి చేశారు. అద్దాలు కూడా పగులగొట్టారు. అయితే ఆ సమయంలో బస్సులో క్రికెటర్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసులు పెట్టి, అరెస్టు చేశారు.