బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులకు యువకుడు బలయ్యాడు. తప్పుడు కేసులు పెట్టారంటూ ఆత్మహత్యకు యత్నించాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే సాయి గణేష్‌పై మంత్రి ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులకు యువకుడు బలయ్యాడు. తప్పుడు కేసులు పెట్టారంటూ ఆత్మహత్యకు యత్నించాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు.. సాయి గణేష్ అనే యువకుడు బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాయి గణేష్ మృతిచెందాడు.
అయితే అధికార పార్టీ నేత ఒత్తిడితో కేసులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. సాయి గణేష్‌పై పోలీసులు 16 కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక, సాయి గణేష్ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతోపాటు పలువురు పరామర్శించారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలియజేసి.. ఆయన సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్టుగా బీజేపీ నేతలు చెప్పారు.
సాయి గణేష్ ఆత్మహత్యకు యత్నించడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ప్రదర్శనగా ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. స్థానిక మంత్రి ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.