నగ్నంగా మహిళ ఊరేగింపు.. సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న ఘటన
ఆత్యాధునిక సాంకేతికతతో దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా.. కొందరు ఇంకా మూఢనమ్మకాలను వీడడం లేదు. పిల్లి ఎదురు వస్తే అపశకునం అని.. బయటకి వెళ్లే ముందు ఎవరైనా తుమ్మితే కాసేపు ఆగి వెళ్లడం వంటి మూఢనమ్మకాలు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తుందనే నెపంతో స్థానికులు ఓ మహిళను నగ్నంగా ఊరేగించారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నందుబార్ జిల్లాలో నివసిస్తోన్న ఓ మహిళ మంత్రాలు చేస్తోందని స్థానికులు అనుమానించారు. దీనితో అనుమానం పెంచుకుని కోపంతో రగిలిపోతున్న స్థానికులు.. దారుణానానికి పాల్పడ్డారు. ఇటీవల ఆ మహిళను వివస్త్రను చేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో మహిళకు జరిగిన అవమానాన్ని చూసిన మహారాష్ట్ర అందశ్రద్ధ నిర్మూలన్ సమితి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.