దళిత బాలికపై అత్యాచారం కేసులో..మరో 10 మంది అరెస్టు
సంచలనం సృష్టించిన దళిత బాలికపై అత్యాచారం కేసులో మరో 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన తొండెపు కమలాకరరావు, ఇబ్రహీంపట్నంమండలం కొత్తగేటు గ్రామానికి చెందిన తన్నీరు మురళీకృష్ణ, నగరంలోని ఇన్నర్‌రింగురోడ్డులో గల శ్రీరామ్‌నగర్ 10వ లైనుకు చెందిన ఆరికట్ల రాధాకృష్ణమూర్తి, ఇబ్రహీంపట్నం మండలం కేసనకొండకు చెందిన షేక్ మీరావలి, కంచికచర్ల మండలం గనిఆతుకూరుకు చెందిన సయ్యద్ దన్వీర్, నందిగామ మండలం ఐతవరంనకుం చెందిన బి.కొండలరావు, కంచికచర్లకు చెందిన చింతల గోపి, కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన రేగళ్ల కల్యాణ్, విజయవాడ రూరల్, ప్రసాదంపాడుకు చెందిన బళ్లారపు తిరుమలగిరిబాబు, విజయవాడ భవానీపురంనకు చెందిన ధనుంజయరావులను వెస్టు ఇన్‌చార్జి ఏఎస్పీ కె.సుప్రజ ఆధ్వర్యంలో అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే 64 మంది అరెస్టు కాగా అరెస్టు అయిన వారి జాబితా 74కు చేరింది. మరో ఆరుగురిని అరెస్టు చేయాల్సి ఉందని, అందులో ఒకరు లండన్‌లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో విజయవాడకు చెందిన మాజీ హోంగార్డు జసింత హేమలతలను సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి పది మందిని అరెస్టు చేయటం జరిగిందన్నారు. ఆయా నిందితులు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో గుంటూరులోని న్యాయవాదిని కలిసేందుకు రాగా ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టు చేయటం జరిగిందన్నారు. కేసులో మొత్తం 80 మంది నిందితులను గుర్తించామని, వారిలో 35 మంది వ్యభిచార నిర్వాహకులు కాగా 39 మంది విటులని తెలిపారు. ఈ కేసులో మొత్తం నిందితుల నుంచి 33 సెల్‌ఫోన్లు, ఒక కారు, మూడు ఆటోలు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు.