ఎల్లారెడ్డిపేటలో తండ్రిని అతి కిరాతకంగా చంపిన తనయుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు తండ్రిని విచక్షణారహితంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి రాములు (60), తన ఒక్కగానొక్క కొడుకు శ్రీనివాస్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తండ్రిని భూమి విషయంలో రెండు గుంటలు అమ్ముదామని నిత్యం వేధించేవాడు. సోమవారం అతిగా మద్యం సేవించి తండ్రితో గొడవకు దిగగా తండ్రి మందలించడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించి తలపై తీవ్రంగా, అతి కిరాతకంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని శ్రీనివాసు అతని భార్య శిరీషను అదుపులోకి తీసుకొని, సంఘటనా స్థలం వద్ద పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య నరసవ్వ గత నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కూతురు దేవి లక్ష్మి వద్దే ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం తన కుమారుని దగ్గరకు రాగా కుమారుడు దాడికి పాల్పడ్డాడు. మృతుని కూతురు దేవ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.