రూ.110కి చేరిన కిలో టమోటా ధర..
ఏపీలో కిలో టమాటా ధర రూ.80 నుంచి రూ.100లు పలుకుతోంది. పక్క రాష్ట్రం అయిన తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లో కిలో టమోటా రూ.110కి చేరడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. కోయంబేడు మార్కెట్కు పలు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు 600 లారీల్లో సుమారు 6 వేల టన్నుల టమోటాలు దిగుమతి అవుతుండగా వారం రోజులుగా వర్షాల కారణంగా మార్కెట్కు 400 లారీల్లో 4,500 టన్నుల టమోటాలు మాత్రమే వచ్చాయి.
ఈ కారణంగానే ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. దీంతో టమోటా ధరలు రోజు పెరుగుతూ వస్తున్నాయి. నేడు కేజీ రూ.110కి టామాటా ధర చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే చిల్లర దుకాణాల్లో కిలో టమాటా ధర రూ.120కి విక్రయమవుతుండటంతో మరో దారి లేక ప్రజలు చేతులు దులుపుకుంటూ వెళ్లిపోతున్నారు.