డ్రైవర్ ను నేనే హత్య చేశా-వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకారం-షాకింగ్ రీజన్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. తన సొంత కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబును అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ కాకినాడలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
కాకినాడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న పోలీసుల విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నేరాన్ని అంగీకరించారు. తన కారు డ్రైవర్ అనంతబాబును తానే చంపినట్లు వెల్లడించారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన జరిగిన ఘటనను వివరించారు. ఇందులో ఆయనే స్వయంగా కారు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపినట్లు తెలిపారు. ఇందులో తాను ఒక్కడినే పాల్గొన్నట్లు కూడా ఎమ్మెల్సీ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.
తన కారు డ్రైవర్ అయిన వీధి సుబ్రమణ్యం తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందునే తానే స్వయంగా చంపేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో హత్య జరిగిన తీరుపై పోలీసులు ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సుబ్రమణ్యం హత్యను ఫోరెన్సిస్ వర్గాలు నిర్ధారించాయి. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలతో పాటు మెడపై కాలు వేసి తొక్కినట్లు కూడా గుర్తించారు. అలాగే ఇసుకలో కుక్కి మరీ హత్య చేసినట్లు కూడా నిర్ధారించారు. ఇప్పుడు తానే ఈ హత్య చేసినట్లు ఎమ్మెల్సీ కూడా అంగీకరించడంతో వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతందన్నది ఆసక్తికరంగా మారింది.