రివర్‌ ఫ్రంట్‌.. స్పీడప్‌

0 7,504

◆ వేగంగా ప్రాజెక్టు పనులు

◆ అల్గునూర్‌ వైపు కొనసాగుతున్న రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం

కరీంనగర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులను మార్చి 17న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చెక్‌ డ్యాంల నిర్మాణ పనులు చేపడుతుండగా.. నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి గత రెండు నెలలుగా బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు…

◆ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా

కరీంనగర్‌లోని మానేరు నదిపై రూ.410 కోట్లతో ‘మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు’ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా మొదటి విడుతలో ఎల్‌ఎండీ డ్యాం నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించేందుకు రూ.310.46 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, ప్రస్తుతం అల్గునూర్‌, సదాశివపల్లివైపుగా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి..

ప్రస్తుతం నాలుగున్నర మీటర్ల ఎత్తు మొదటగా ఈ వాల్స్‌ నిర్మించిన తర్వాత మరో ఎత్తులో మరో వాల్‌ నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వానకాలంలోగా సాధ్యమైనంత మేరకు వాల్స్‌ నిర్మించేలా ఈ పనులు దక్కించుకున్న ఎస్‌ఎల్‌ఆర్‌ సంస్థ ముందుకెళ్తోంది. వీటితో పాటు నది లోతును పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడుతలో చేపడుతున్న పనులు ఏడాదిన్నరలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా పనులు చేపడుతున్నామని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఇప్పటికే రూ.80 కోట్ల వ్యయంతో చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వాటర్‌ పౌంటేన్లు, బోటింగ్‌, కాటేజీలతో పాటుగా ప్రపంచ స్థాయిలో థీమ్‌ పార్కులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents