‘పావు తెలంగాణ’ తీర్పు ఏమిటి ?

‘యుద్ధ క్రీడల్లో మీ పన్నాగాన్ని  ఇతరులు  అర్ధం చేసుకోలేకపోవడం చాలా ముఖ్యం. ప్రత్యర్థులపై  రహస్యంగా దాడి చేయాలి. మీ కదలికలు ఊహించలేని విధంగా ఉండాలి. అప్పుడు అవతలివారు మిమ్మల్ని ఎదుర్కోలేరు. అలాంటి ప్రయత్నాలను సిద్ధం చేసుకోవడం వారికి అసాధ్యమవుతుంది’ అని క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో చైనాకు చెందిన తత్వవేత్త  హూఐనన్ అన్నాడు.టిఆర్ఎస్ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఎత్తుగడలు  ఇలాగే ఉంటాయి.మెరుపు వేగంతో ఆయన తీసుకునే నిర్ణయాలకు గడచిన ఆరున్నరేళ్లుగా ప్రతిపక్షాలకు  మైండ్ బ్లాంక్ అవుతోంది. 2018 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లినా, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందుగా జరుపుతున్నా కేసీఆర్ వ్యూహరచనను, ముందుచూపును నిర్ధారిస్తున్నవి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ. కనుక ఆ సంస్థ తీసుకునే నిర్ణయాలతో  ప్రభుత్వానికి ఏమి సంబంధం? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. జవాబు కష్టం.2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లిన తీరు,కొంగర కలాన్ సభ, కేబినెట్ రద్దు, అభ్యర్థుల ప్రకటన ఎంత వేగంగా జరిగాయో చూసాం. ప్రస్తుత జీ హెచ్ఎంసి ఎన్నికలను మూడు నెలల ముందుకు జరిపినా అదే పంథా. రాష్ట్ర ఎన్నికల సంఘం  ఎన్నికల షెడ్యూల్,నోటిఫికేషన్, నామినేషన్ స్వీకరణ,తిరస్కరణ, ఉపసంహరణ, పోలింగు తేదీలు యుద్ధప్రాతిపదికన ప్రకటించడం సాధారణ ఓటర్లను ఆశ్చర్యపరచినవి. ప్రతిపక్షాలను దిగ్భ్రాంతికి గురి చేసినవి.మూడు రోజుల సెలవుల అనంతరం పోలింగ్ జరుగుతుండటం పోలింగ్ శాతానికి గండి కొట్టవచ్చు.పోలింగ్ శాతం పెరిగితే బిజేపీ కి లాభం. తగ్గితే టీఆరెస్ కు లాభం. ఆ లెక్ఖలు వేరు.

అయితే జీహెచ్ఎంసి ఎన్నికలకు ఫిబ్రవరి దాకా సమయం ఉన్నదని నిద్రపోతున్న విపక్షాలకు ఇది గుణపాఠమే. కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలకు పేరు మోసిన నాయకుడు. జనమంతా దుబ్బాక ఉపఎన్నికపై దృష్టిని కేంద్రీకరించినప్పుడే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రోడ్ మ్యాపును సిద్ధం చేసి ఉంటారు.రణ నీతిని రూపొందించి ఉంటారు.అభ్యర్థుల ఖరారు,పార్టీ పార్లమెంటు, శాసనసభ్యుల, నాయకుల సమావేశాలు,నేడు ఎల్బి స్టేడియం లో బహిరంగసభ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో ల తుపాను, కవిత, హరీశ్ రావు ప్రచార హోరు…..కేసీఆర్ ‘ముందస్తు’ కార్యాచరణ ప్రణాళికలో భాగమే.  ఆయన 24 గంటలూ రాజకీయాలే ఆలోచిస్తారు. రాజకీయమే ఆయన ఉఛ్వాస నిశ్వాసలు. మిగతా పార్టీలు, నాయకులలో ఈ సంసిద్ధత లేదు. ముందస్తు ప్రణాళికలు లేవు. భవిష్యత్ పరిణామాలపై అంచనాలు లేవు.భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం లేదు. ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడం కేసీఆర్, కేటీఆర్ లకే చెల్లింది. హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు,ముందస్తు  నివారణ చర్యలు,సహాయకార్యక్రమాల వైఫల్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితులను పరామర్శించకపోవడం వంటి మైనస్ పాయింట్లను ‘పది వేల రూపాయల’తో అధిగమించారు. పదివేల పంపిణీ పూర్తయ్యే నాటికి ఎన్నికల ‘కోడ్’ అమల్లోకి రానుందని, విధిగా ఈ కార్యక్రమం స్తంభిస్తుందని కేసీఆర్, కేటీఆర్ లకు తెలుసు. ఈ లోగా పది వేల  రూపాయల  పంపిణీ ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం, అలాంటి లేఖ బీజేపీ అధ్యక్ష్యుడు సంజయ్ పేరిట వెలుగులోకి రావడం, తర్వాత అది ఫోర్జరీ దంటూ బండి సంజయ్ ప్రకటించడం… వెరసి పదివేల రూపాయలను వరద బాధితులకు ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయనే ప్రచారానికి ఒక అస్త్రంగా కేటీఆర్ చేతికి అందింది. అయితే ఈ ‘పది వేల’ వ్యవహారంతో పని జరగదని బిజెపి భావోద్రేకాలను రెచ్చగొట్టే కార్యాచరణ అమలు చేస్తున్నది. దీనికి తోడు మజ్లిస్ పార్టీ నాయకులు ఆ ట్రాప్ లో పడ్డారు. అందువల్ల  హైదరాబాద్ నగరంలో అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలను పూర్వపక్షం చేస్తూ ‘సర్జికల్ స్ట్రైక్’,  పీవీ, ఎన్ఠీఆర్ ల సమాధుల కూల్చివేత తదితర ప్రకటనలు ముందుకు వచ్చాయి. ఇది మజ్లిస్, బీజేపీ ల ‘కుమ్మక్కు’ రాజకీయాలనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నవి. ఇక కాంగ్రెస్ పరిస్థితి  పార్టీ తెలంగాణలో ఎంతగా శిథిలమైందో చూస్తూనే ఉన్నాం.  ఆ పార్టీ నాయకులు  ఎన్నికలు ప్రకటించినప్పుడే కళ్ళు నులుముకుని బయటకు వస్తారు.నిరంతరం రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అందులోనూ ‘పొటెన్షియల్’ వ్యక్తులెవరో కేసీఆర్ కు తెలుసు. అందువల్ల ఆయన 2015 నుంచే మిగతా పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.

రాజకీయాల్లో ‘అమ్మకాలు – కొనుగోళ్లు’ కొత్తేమీ కాదు. కేసీఆర్ ప్రారంభించినదీ కాదు. అయితే ఇదివరకటి నాయకుల కన్నా కేసీఆర్ ఒక ఆకు ఎక్కువ చదివారు. టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకొని పోవడం టిఆర్ఎస్ కు ఒక అనుకూల అంశమైతే, పిలవగానే ‘ప్రగతిభవన్’ కు పరుగులు తీసిన, ఇంకా పరుగులు తీయదలచుకున్న వారు కాంగ్రెస్ శిబిరంలో కోకొల్లలు. దీనికంతటికీ కారణం అధికార, ధన వ్యామోహమే. ”త్యాగాలు తప్ప భోగాలకోసం వెంపర్లాడని దొడ్డికొమరయ్యలం” అని ఒక కవి అన్నాడు. తెలంగాణలో  కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిష్టులు… ఎవరిలోనూ పోరాట పటిమ కనిపించడం లేదు.అధికార పార్టీపై తెగువతో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేయాలన్న సోయి లేదు. త్యాగాల సంగతి చాలా దూరం.  భోగాల కోసం వెంపర్లాడని రాజకీయ నాయకులు అత్యంత అరుదు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ  గ్రాఫ్ ఘోరంగా పడిపోతున్నది. ఎన్నికలు ఏవైనా ఓడిపోవ‌డం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. గతంలో  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ‌లమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని జిల్లాల‌కే, కొన్ని నియోజకవర్గాలకే ప‌రిమిత‌మైంది. ” జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు అతి దారుణంగా ఉంది.నా  జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.  ఎన్నికలు  ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం లేదు. ఇప్పటికిప్పుడు హడావుడిగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ” అని టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు.కాకలు తీరిన తెలంగాణ రాజకీయ నాయకుల్లో డి.ఎస్. ఒకరు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే గుర్తు లేదు. టిఆర్ఎస్ తమ మనిషిగా ఆయనను పరిగణించడం లేదు. ఎన్నికలు హడావిడిగా పెడుతున్నారంటున్న డి.ఎస్.మరి  అంత హడావిడిగా టిఆర్ఎస్ లో ఎందుకు చేరినట్టు ? రెండు సార్లు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష్యునిగా పని చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన డి.ఎస్. అధికారం లేకుండా, ఏదో ఒక పదవి లేకుండా ఉండలేరా ? రాజ్యసభ సభ్యుడు కె.కె కూడా అంతే.అలాగే ఇతర పార్టీల లోనూ! ఏమిటీ బేలతనం! ఏమిటీ బలహీనత ! ఏమిటీ లొంగుబాటు !ఏమిటీ దివాళాకోరుతనం! అధికారంలోనో,  లేదా అధికారం  ఉన్న చోట మాత్రమే  ఉండాలి.

అదే ఫార్ములా!పార్టీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ ను మరో ‘గ్రూపు’ ఇబ్బందులకు గురి చేస్తున్నది.కాంగ్రెస్ పార్టీలో మాదిరిగానే బీజేపీలోనూ కేసీఆర్ ‘రహస్య మిత్రులు’ ఉన్నారన్నది జగమెరిగిన సత్యం.  దక్షిణాదిన ఇప్పటికే కర్నాటకలో చక్రం తిప్పి… ఇక తెలుగునాట, ముఖ్యంగా తెలంగాణాలో అడుగిడాలన్న తపనతో ఉన్న కమలానికి… ఇక్కడి అంతర్గత కుమ్ములాటలు బీజేపీ కలల్ని కల్లలు చేసే అవకాశాలు ఉన్నవి.పైగా కేసీఆర్ ఏకంగా ఢిల్లీ తోనే తలపడే ప్రయత్నాలలో ఉన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగడతానంటున్నారు. ‘‘తెలంగాణ మే అగ్లీ బార్‌ హమారీ సర్కార్‌ హోగీ. (తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే)’’ అని ప్రధాని మోదీ 2019 లో  వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఇచ్చారని అప్పట్లో బిజెపి ఎంపీలు గర్వంగా చెప్పుకున్నారు.దుబ్బాక ఫలితం వెలువడిన వెంటనే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అమితానందం వ్యక్తం చేశారు. దుబ్బాకలో గెలవగానే పండుగ కాదు కదా! కాగా తెలంగాణ ప్రజల అవసరాలు , రాజకీయ పార్టీల, నాయకుల మానసిక పరిస్థితిని కేసీఆర్ 2001కి ముందే కాచి వడబోశారు.  ఎవరిని ‘లొంగదీసుకోవచ్చునో’,  ఎవరికి ఎలాంటి ‘ఎర’ వేయవచ్చునో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టుపై గెలిచిన వారెందరు? ఇప్పుడు మిగిలిన వారెందరు?  అధికార పార్టీ ప్రలోభాలకు, ఇతరత్రా బెదిరింపులకు గురయ్యే కాంగ్రెస్ లేదా మరో పార్టీ నాయకులు, క్యాడర్ మరే రాష్ట్రంలోనూ కానరారు. పశ్చిమ బెంగాల్ లో నాలుగు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కానీ అక్కడ కాంగ్రెస్ మనుగడలో ఉన్నది. బీహార్ తదితర రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ఉనికిలోనే ఉన్నది.

ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో వలె పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో లేదు.కాంగ్రెస్ కు ఓటువేసినా అది వృధా కావచ్చునని, గెలిచాక ఎలాగూ టిఆర్ఎస్ లో చేరిపోతారని ప్రజల్లో అనుమానం స్థిరపడింది. మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి గురించి పోలింగుకు ఒక రోజు ముందు ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆ ప్రచారం బూటకమే కావచ్చు.శ్రీనివాసరెడ్డికి సంబంధం లేకుండా ప్రచారం సాగి ఉండవచ్చును. కానీ నిజంగా గెలిచి ఉంటే ఆయన టిఆర్ఎస్ లోకి చేరరన్న హామీ ఏమీ లేదు. కాంగ్రెస్ దురవస్థ ఇది. ఇక దుబ్బాకలో ఓటమి గురించి కేసీఆర్ ముందే అంచనా వేసి ఉండవచ్చు. అక్కడి ప్రతికూల వాతావరణం ఆయన పసి గట్టకుండా ఉండరు.  ఆ కారణంగానే దుబ్బాక విజయం వల్ల లభించిన ‘ఉష్ణోగ్రత’ను గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ వాడుకునే వ్యవధి లేకుండా ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడమే కేసీఆర్ వ్యూహం.పైగా దుబ్బాకలో ప్రభావితం చేసిన అంశాలు, బీజేపీ గెలుపునకు గల కారణాలు వేరు. గ్రేటర్ ప్రజలపై పని చేసే అంశాలు పూర్తిగా భిన్నం.కానీ బండి సంజయ్ జీహెచ్ ఎంసి ఎన్నికల ప్రచార సరళిని హైజాక్ చేసి హిందూ ఓటు బ్యాంకు వైపు మళ్లించగలరని టిఆర్ ఎస్ నాయకులు ఊహించలేదు.
ఇది ‘పావు తెలంగాణ’. తెలంగాణ .తెలంగాణ జనాభాలో దాదాపు 33 శాతం  పౌరులు నివసిస్తున్న ‘మినీ ఇండియా’! జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను టిఆర్ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నవి.ఈ రేసులో కాంగ్రెస్ కనుమరుగయ్యింది. ఎంపీ రేవంత్ రెడ్డి మినహా హడావిడి లేదు. కాగా ఈ ఫలితాలు 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రెండు పార్టీలు భావిస్తున్నవి.జిహెచ్ ఎంసిపై పాగా వేస్తే తెలంగాణలో రాజ్యాధికారం లభిస్తుందని బీజేపీ నమ్మకం.

హైదరాబాద్ నగరంలో తాగునీరు,పారిశుధ్యం, నిరంతరాయ విద్యుత్తు, రహదారులు,రవాణా వ్యవస్థ వంటి కనీస సౌకర్యాలు, శాంతి భద్రతలు తదితర అంశాలు ప్రభావితం చేయవచ్చు. బీజేపీ ప్రయోగించదలచుకున్న  ‘హిందుత్వ’ కార్డు హైదరాబాద్ లో పనిచేయకపోవచ్చు.   ఆ కారణంగానే మజ్లీస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచారం సాగుతోంది. మూడు , నాలుగు దశాబ్దాల క్రితం పాతబస్తీలో ఉన్న వాతావరణం వేరు. ప్రజల ఆలోచనా ధారలో ఇప్పుడు చాలా మార్పు కనబడుతున్నది. ఇదేమీ ఎంఐఎం గొప్పతనం కాదు. వేగంగా మారుతున్న సామాజిక, ఆర్ధిక కారణాలు ప్రజల్ని ‘మతోన్మాదం’ నుంచి బయటకు నెట్టివేశాయి.పాత బస్తీలో కూడా కేసీఆర్ కు ఓటు బ్యాంకు ఏర్పడడం మనం గమనించాలి. కేసీఆర్ ను మించిన మహా  ‘హిందూ’ ఎవరుంటారు ?యజ్ఞాలు, యాగాలు, యాదాద్రి  చారిత్రక  ఆలయ నిర్మాణం, స్వాములతో చెట్టాపట్టాలు… ఇవన్నీ కేసీఆర్ ను హిందూ ప్రజలు అభిమానించేలా చేస్తున్నవి.అందుకే హిందూ ఓట్లను ‘కారు’ కు దూరంగా నెట్టివేసే పనిలో అమిత్ షా డైరెక్షన్లో ‘బండి’ దూకుడుగా పోతున్నారు. అటు ముస్లిం మైనారిటీలలో కేసీఆర్ కు అద్భుతమైన బలం ఉన్నది. హిందూ ఓట్లను సంఘటితం చేసే పనిలో బిజేపీ నాయకత్వం బిజీగా ఉన్నది.

ఇదిలా ఉంటే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరాయినదని చెప్పడం ఎంత కష్టమో, ఖరారు కాలేదని చెప్పడమూ అంతే కష్టతరమైనది. కేసీఆర్ చాలా లోతైన మనిషి. ఆయన అర్ధం కాడు. ఆయన మనసులో ఏమి నడుస్తున్నదో ఆయనకే తెలుసు. ”ఆధునిక యుగంలో సంపూర్ణ విజయమే లక్ష్యం అనేది మూల సూత్రం. ఒకసారి గొప్ప విజయాన్ని సాధించాక,ఇక విశ్రాంతి గురించి మాట్లాడకూడదు. వెసులుబాటు కావాలని అనుకోకూడదు.”అని రాజకీయ శాస్త్రవేత్త  నికోలో మాకియవెలి (1469 -1527) అన్నాడు. ”సంపూర్ణ విజయాన్ని సాధించాలంటే మీరు నిర్దయగా ఉండాల్సిందే” అని నెపోలియన్ (1769 -1821) చెప్పాడు. నికోలో మాకియవెలి చెప్పినట్లుగానే  2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ విశ్రాంతి తీసుకోలేదు.ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడంలో, సొంత పార్టీని బలోపేతం చేయడంలో, అధికారాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ప్రతిక్షణం వ్యూహాలు పన్నడంలో,ఓటుబ్యాంకులను స్థిరపరచుకోవడంలో,  కుమారుడు కేటీఆర్ ను ‘వారసుని’గా తీర్చిదిద్దే కోర్సు పూర్తయ్యింది.ఇప్పటికే పార్టీ ‘కో పైలట్’గా, మంత్రిగా  కేటీఆర్ తన సమర్ధతను చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ కేటీఆర్ రాజకీయ, అధికార కార్యకలాపాల్లో,పార్టి కార్యక్రమాల్లో అన్నీ తానే అయి వ్యవహారాలను నడిపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents