నేతాజీ ఆశయ సాధన కోసం క్రుషి చేయాలి
ఏఐఎఫ్ బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
ఘనంగా ఏఐఎఫ్ బీ పార్టీ ఆవిర్బావ వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధుడు, ధీరుడు ఆజాద్ హింద్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 83వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండాను అంబటి జోజిరెడ్డి ఎగురవేశారు. అనంతరం సుభాష్ నగర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే జెండాను ఎగురవేశారు.ఈ సంధర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939లో స్థాపించారని తెలిపారు . ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే పోరాటే ఏకైక మార్గమని బోస్ బావించారని, స్వాతంత్ర్యం ఒకరిస్తే తీసుకునేది కాదంటూ 2 లక్షల మంది సైన్యాన్ని నడిపారన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మేరునగధీరుడిగా నేతాజీ బాసిల్లారని పేర్కొన్నారు. తన అసమాన త్యాగాలతో ఆయన భావితరాలకు ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తారన్నారని చెప్పారు. ఆ మహానుభావుడు లేకుంటే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదని, భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి, మరో ఛత్రపతిగా పేరొందిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆశయసాధనకు, సర్వ సమానత్వం కోసం పోరాడుదామన్నారు.
సమసమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. కళ్ళజోడు ధరించి చేతి కర్రతో శాంతి వచనాలు చెబితేనో, నెత్తిన టోపి ధరించి జేబులో గులాబీ పెట్టి పోరాడితే ఈ దేశానికి స్వేచ్ఛ రాలేదని బ్రిటీష్ పాలకులే ఒప్పుకున్నార్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దాంతాలతో నిర్మాణాత్మకంగా బలోపేతానికి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, బూత్ స్థాయిలో పటిష్టంగా ఉండి ఎన్నికలకు సిద్దం కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పోరాడి ప్రజల్లో ఉండాలన్నారు. ప్రజలు, రైతుల పక్షాన ఉద్యమించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఆ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్ బీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిమాటి సంతోష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అయిల ప్రసన్న, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శంకర్ కురువెల్లి, సుతారి సంఘం జిల్లా అధ్య్షక్షుడు బెక్కంటి రమేశ్, ఏఐఎస్ బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికం రాజశేఖర్, జిల్లా నాయకులు పెద్దెల్లి శేఖర్, బి.లింగమూర్తి , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.