వారం రోజుల్లోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి:
కలెక్టర్ కర్ణన్
మన ఊరు మన బడి పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎం.ఈ.ఓ.లు, ఏఈలతో మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని, పూర్తి చేసిన పనులకు నిధులు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, విద్యుత్, త్రాగునీరు, కంపౌండ్ వాల్స్, కొత్త తరగతి గదులు మరియు చిన్న చిన్న రిపేర్లు, మొదలగు పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో 16 మండలాలోని 230 ప్రభుత్వ పాఠశాలలకు గానూ అందులో 78 పాఠశాలల పనులు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సి.ఆర్.పి.లను ప్రతి బడికి ఒక్కరిని కేటాయించి మన ఊరు- మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని జిల్లా విద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, ఈ.ఈ. శ్రీనివాస్, ఎం.ఈ.ఓ.లు, ఏ.ఈ.లు, తదితరులు పాల్గొన్నారు.