* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తామని బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శనివారం రోజు నగరంలోని కార్ఖానా గడ్డ ప్రభుత్వ పాఠశాలను మేయర్ సునీల్ రావు కలెక్టర్, సుడా చైర్మన్ జీ.వి రామకృష్ణారావు, ఆర్ వి కర్ణన్ లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవ ఇస్లావత్ తో కలిసి సందర్శించారు. విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించుట కొరకు నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ క్లాస్ రూమ్ ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన సహారా ఏజెన్సీ ఏర్పాటు చేసిన టెక్నాలజీ విద్యాబోధను పరిశీలించి బోధన కు సంబంధించిన వివరాలు ఏజెన్సీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు టెక్నాలజీ విద్యకు సంబంధించిన క్రోమ్ బుక్స్ ను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో 52 ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్/ స్మార్ట్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, తెలిపారు. ఈ క్లాస్ రూమ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు గూగుల్ క్రోమ్ బుక్స్, యుపిఎస్ లు, స్టూడెంట్ డెస్కులు మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి… టెక్నాలజీతో కూడిన విద్య బోధన చేస్తామన్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా బోధన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరిగి నేర్చుకునే పాఠ్యాంశాలు సులభతరం అవుతాయన్నారు. టెక్నికల్ విద్యా విధానంలో ప్రత్యేకంగా ఆడియో, వీడియో పద్ధతిని అవలంబించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి విద్యా విధానం తో విద్యార్థిని విద్యార్థుల్లో అభ్యసనం పట్ల ఆసక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న ఈ క్లాస్ రూమ్ సౌకర్యాన్ని విద్యార్థులందరూ వినియోగించుకునేలా పాఠశాలల ఉపాధ్యాయ బృందం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సిహెచ్ వి ఎస్ జనార్దన్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.