వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 08 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. 8వ తేదీన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉత్సవాలు ప్రారంభిస్తారని ఇందులో జిల్లా నుండి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొంటారని,9న జండా ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, 10 వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి ఒకే చోట కనీసం 750 చొప్పున ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని ఆదేశించారు.
ఆ ప్రాంతాన్ని ఫ్రీడమ్ పార్క్ గా సంబోధించడం జరుగుతుందన్నారు. 11 న మున్సిపల్, మండల స్థాయిలో ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని, కరీంనగర్ నగరం లో 30 వేల మందితో ఫ్రీడం రన్ ఉంటుందని, 12 న జాతీయ సమైక్యతా రక్షాబంధన్, 13 న ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ తో ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగురవేయాలన్నారు. 14 న జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణాసంచా కాల్చడం, 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16 న అన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయంలో సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17 న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18 ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, 19 న అనాధ, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20 న స్వయం సహాయక సంఘాలు, మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 21 న పంచాయతీ మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని స్థాయిలలో అధికారులు ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.15 వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ఇంటింటికి జెండాలు పంపిణీ చేయాలని, అదే సమయంలో మువ్వన్నెల జెండా గౌరవానికి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా ఫ్లాగ్ కోడ్ పక్కాగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అయన సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ గర్వాల్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్జువేరియా,డిపిఓ వీర బుచ్చయ్య డిఅర్డిఎ శ్రీలత, పిడి మెప్మా రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, డి డబ్ల్యూ ఓ పద్మావతి, డిడి హార్టికల్చర్ శ్రీనివాస్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజ వీరు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.