చెప్పులు మోసే వెధవలకు బుద్ధి చెప్పాలి : సీఎం కేసీఆర్

పెద్దపల్లి : తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుజరాత్‌లో అమలు కావడం లేదు. అక్కడ దోపిడీ తప్ప మరొకటి లేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అక్కడ్నుంచి వచ్చేటటువంటి గులామ్‌లు, దోపిడీ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో కనబడుతున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుదామా? దయచేసి ఆలోచించండి. 26 రాష్ట్రాల రైతులు తమకు చెప్పారు. మా వడ్లు కొనరు అని చెప్పారు. ఢిల్లీలోనే నేనే స్వయంగా ధర్నా చేశాను. ధాన్యం కొనేందుకు మోదీకి చేత కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో నూకలకు, గోధుమలకు షార్టెజ్ వస్తుంది. పరిపాలన చేతగాక దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తున్నారు. మోసపోతే గోస పడుతాం. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కి పోతాం. కూలగొట్టడం చాల అలుక.. కట్టడమే చాలా కష్టమని కేసీఆర్ చెప్పారు.
నేను చెప్పే మాటల్లో సత్యం.. అందుకే చినుకులు..
ఇవాళ బాగు పడే సమయంలో గజదొంగలు. లంచగొండులు వచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటూ, మతం పేరు మీద కొట్లాడమని చెప్తున్నారు. నెత్తురు పారించమని చెప్పే పిశాచులు ప్రజలు మధ్య ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాట్ల్లో సత్యం వుంది. కనుక చినుకులు పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
చెప్పులు మోసే వెధవలు కారు కూతలు కూస్తూ సామాజాన్ని కలుషితం చేస్తున్నారు. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెప్తున్నాం. పెద్దపల్లి చైతన్యం ఉన్న గడ్డ. సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలి. అందరం కలిసి 2024లో బీజేపీ ముక్త్ భారత్ సృష్టించాలి. అందుకు సన్నద్ధపడాలి. ముందుకు కదలాలి. అప్పుడే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం. నిద్రాణమై ఉండకుండా మేల్కోని ప్రజలను చైతన్యం చేసి బీజేపీ, మతపిచ్చిగాళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి ముందుకు పోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.