అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. చేసిన అప్పులు తీర్చలేక మానసిక వేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం. అంకంపల్లి గ్రామానికి చెందిన ఆకుల సదయ్య (38) 5 ఎకరాలలో 4 ఎకరాలు వరి, ఎకరం పత్తి, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు అయిపోయాక, అప్పు కోసం పలువురిని కలిసినా అప్పు పుట్ట లేదు. గతంలో చేసిన అప్పులకు ప్రస్తుత పంట సాగు అప్పులు తోడు కావడంతో చేసేదేమీ లేక మానసికంగా కృంగిపోయి మనస్థాపానికి గురైన రైతు సదయ్య ఈనెల 2న ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం మొదట పెద్దపల్లికి తరలించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. అక్కడ కోలుకోకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య స్వప్న, కుమారులు సనత్ కుమార్, వినయ్ కుమారులు ఉన్నారు. కాగా, సదయ్య గ్రామ ఉప సర్పంచ్ కూడా కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజ వర్ధన్ తెలిపారు.