టీఆర్ఎస్ మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు!
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొవ్విరెడ్డి శ్రీనివాస్ వ్యవహారంలో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ పేరు తెరపైకి వస్తోంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన శ్రీనివాస్ నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు, మోసాలు సాగిస్తున్నట్టు అధికారులు సమాచారం సేకరించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాస్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే అదే వ్యక్తి ఇటీవల జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవితో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో మంత్రి గంగుల కమలాకర్‌తో శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు సీబీఐ రెడీ అయింది. ఈ నేపథ్యంలో బుధవారం నోటీసులు ఇచ్చేందుకు గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అటు ఇప్పటికే గ్రానైట్ కేసులో గంగుల కమలాకర్, గాయత్రి రవికి చెందిన సంస్థలపై ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీనివాస్ వ్యవహారంలో సీబీఐ నుంచి నోటీసులు రావడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే కొవ్వూరి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టిన సీబీఐ కస్టడీలో మరింత సమాచారాన్ని రాబట్టనున్నట్టు చూస్తోంది. ఆ వివరాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ బృందాలు దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ పట్నంలోని శ్రీనివాస్‌కు చెందిన ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్న ప్రముఖులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావుకు అనేక మంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థ వద్ద ఆయనకు సంబంధించిన కీలక ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ ఫోన్ డేటా మొత్తం శ్రీనివాస్ సీబీఐ గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో అతడితో సంబంధాలు కలిగిన పెద్ద మనుష్యుల గుట్టు అంతా రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం, గ్రానైట్ కేసులు సహా అనేక కేసుల్లో లోతుగా దర్యాప్తు చేస్తుండగా తాజాగా శ్రీనివాస్ వ్యవహారంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలకు నోటీసులు రావడం తీవ్ర దుమారం రేపుతోంది.
కాగా, సీబీఐ ఇచ్చిన నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 3, 4 రోజుల కిందట శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక గెట్ టు గెదర్‌లో సీబీఐ అధికారి అని నాతో పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ఆ అంశంలోనే వివరాల కోసమే సీబీఐ అధికారులు మా ఇంటికి వచ్చారని వివరించారు. ఏం జరిగిందో చెప్పాలని 160 కింద నాకు నోటీసు ఇచ్చారన్నారు. నేను ఢిల్లీ వెళ్లి ఏం జరిగిందో చెబుతానని, వేరే కారణాలతో సీబీఐ అధికారులు రాలేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.